దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఆయన చేసిన ఒక్క పని వల్ల అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు. ఇటీవలే దేశంలో ఎమర్జెన్సీ మార్షల్ లా ప్రకటించి.. ప్రజల చేత తీవ్ర వ్యతిరేకత పొందిన ఆయన ప్రస్తుతం అభిశంసనను ఎదుర్కుంటున్నారు. ఇది చాలదన్నట్లు తాజాగా యూన్ సుక్ యోల్‌పై ఆ దేశ న్యాయస్థానం అరెస్ట్ వారంట్ జారీ చేసింది. అయితే త్వరలోనే ఆయనను అరెస్ట్ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
దక్షిణ కొరియాలోని ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ డిసెంబర్ 3వ తేదీన ఎమర్జెన్సీ మార్షల్ లా ప్రకటించారు ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్. దీంతో దేశ వ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. పెద్ద ఎత్తున ప్రజలు దీన్ని వ్యతిరేకించారు. దీంతో వెనక్కి తగ్గిన యూన్ సుక్ యోల్ కేవలం 6 గంటల పాటు మాత్రమే ఎమర్జెన్సీ మార్షల్ లాను అమలు చేసి.. ఆపై తొలగించారు. అయినా సరే ప్రజలు, ప్రతిపక్షాలు మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గలేరు. డిసెంబర్ 7వ తేదీన అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు.
అయితే ఆరోజు చాలా మంది అధికార పీపుల్ పార్టీ సభ్యులు అసెంబ్లీని బహిష్కరించడంతో త్రుటిలో అభిశంసన తీర్మానం నుంచి తప్పించుకున్నారు. కానీ వారం రోజుల తర్వాత మళ్లీ ఓటింగ్ చేపట్టగా.. 204 మంది ఆయనను అధికారంలోచి తొలగించాలని ఓటు వేశారు. కేవలం 84 మంది మాత్రమే ఆయనకు సపోర్ట్ చేశారు. ఇలా అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కుంటున్న యూన్ సుక్ యోల్.. తన బాధ్యతలను ప్రధాన మంత్రి హన్ డక్ సూకికి అప్పగించాల్సి వచ్చింది. మరోవైపు తీర్మాన ప్రతులను పార్లమెంట్ న్యాయస్థానానికి పంపింది. అయితే 180 రోజుల్లో కోర్టు యూన్ సుక్ యోల్‌ను పదవిలో ఉంచాలా తప్పించాలా అనేది కోర్టు నిర్ణయిస్తుంది.
ఇదిలా ఉండగా.. యూన్ సుక్ యోల్ మార్షల్ లా ప్రకటించడంపై పోలీసులు, రక్షణ మంత్రిత్వ శాఖ, అవినీతి నిరోధక శాఖ అధికారులతో కూడిన బృందం దర్యాప్తు చేస్తోంది. ఈక్రమంలోనే ఆయనను మూడు సార్లు విచారణకు పిలిచారు. కానీ యూన్ సుక్ యోల్ గైర్హాజరు కావడంతో.. అధికారులు సియోల్ వెస్ట్రన్ డిస్ట్రిక్ కోర్టుకు వెళ్లారు. ఇలా న్యాయస్థానం దక్షిణ కొరియా అధ్యక్షుడిపై అరెస్ట్ వారంట్ జారీ చేసింది. ఈక్రమంలోనే అధికారులు కూడా అతడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పుకొచ్చారు.