ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ పెన్షన్ దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక దేశంలోని ఎక్కడి నుంచైనా.. అంటే ఏ బ్యాంక్ నుంచి అయినా ఏ ప్రాంతం నుంచి అయినా పింఛన్ తీసుకునేందుకు వీలు కల్పించింది. ఈ మేరకు సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ తెచ్చేందుకు ఈపీఎఫ్ఓ ఆమోదం లభించినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి, ఈపీఎఫ్ ట్రస్టు బోర్డు ఛైర్మన్ అయిన మాన్‌సుఖ్ మాండవీయ చెప్పారు. గతేడాది కూడా దీనిపై ప్రకటన చేయగా.. 2025, జనవరి 1 నుంచే ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. దీనితో అంటే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో.. 78 లక్షల మంది పెన్షన్ దారులకు బెనిఫిట్ ఉంటుందని చెప్పారు.
ఇక ఈపీఎఫ్ఓను ఆధునికీకరించడంలో సెంట్రలైజ్డ్ పేమెంట్ సిస్టమ్ అనేది కీలక మైలురాయి అని మాండవీయ చెప్పారు. దీంతో పెన్షనర్లు.. ఏళ్లుగా చేస్తున్న డిమాండ్‌కు దీనితో పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఈ నిర్ణయంతో పింఛన్ తీసుకునే వారు ఇప్పుడు దేశంలోని ఏ ప్రాంతం నుంచి అయినా.. ఏ బ్యాంక్‌కు చెందిన ఏ శాఖ నుంచి అయినా పెన్షన్ పొందే వీలుందన్నారు.
దీంతో ఇక మీదట పింఛన్ దారులు.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లిన సమయంలో పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కూడా బదిలీ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇంకా.. ఏదైనా బ్యాంకు లేదా బ్రాంచ్ మార్చుకోవాల్సిన సందర్భంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.
>> ప్రస్తుత పింఛన్ పంపిణీ వ్యవస్థలో సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ సమూల మార్పులకు శ్రీకారం చుట్టనుంది. ఇప్పుడు ఈపీఎఫ్ఓ జోనల్ లేదా ప్రాంతీయ కార్యాలయాలు కేవలం 3-4 బ్యాంకులతో మాత్రమే ఒప్పందాల్ని కలిగి ఉన్నాయి. పెన్షన్ ప్రారంభ సమయంలో.. పెన్షనర్లు ధ్రువీకరణ కోసం సంబంధిత బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అయితే సెంట్రలైజ్డ్ విధానం అమల్లోకి వస్తే.. అప్పుడు బ్రాంచును సందర్శించాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకా పింఛన్ విడుదలైన వెంటనే మొత్తం ఖాతాలో జమవుతుంది. దీంతో కొత్త వ్యవస్థతో పింఛన్ పంపిణీలో ఖర్చు కూడా తగ్గుతుందని భావిస్తోంది ఈపీఎఫ్ఓ. ఆ తర్వాతి దశలో ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్ కూడా తేనున్నట్లు మాండవీయ చెప్పారు.