మనం పెట్టుబడులు పెట్టేందుకు ఎన్ని ఆప్షన్లు ఉన్నా.. ఇప్పటికీ పోస్టాఫీస్ పథకాలు లేదా స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య ఎక్కువే. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉంటుంది. నిర్దిష్ట వడ్డీ రేటు ప్రకారం గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయి. ఎలాంటి రిస్క్ ఉండదని చెప్పొచ్చు. చిన్న మొత్తాల్లో కూడా డిపాజిట్లు చేయొచ్చు. దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో రాబడి అందించే ఎన్నో స్కీమ్స్ ఇందులో ఉన్నాయి. ఇంకా ప్రతి 3 నెలలకు ఓసారి ఇక్కడ వడ్డీ రేట్లను కేంద్రం సమీక్షించి.. పెంచడం లేదా తగ్గించడం లేదా స్థిరంగా ఉంచడం చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా.. అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికం ముగిసిన నేపథ్యంలో.. జనవరి- మార్చి క్వార్టర్‌కు గానూ.. ఈ పోస్టాఫీస్ పథకాల కొత్త వడ్డీ రేట్లను ప్రకటించింది. అయితే మరోసారి నిరాశే ఎదురైంది. వడ్డీ రేట్లను యథాతథంగానే ఉంచింది. దీంతో వడ్డీ రేట్లు పెరుగుతాయని ఆశలు పెట్టుకున్న వారికి మరోసారి నిరాశే ఎదురైందని చెప్పొచ్చు.
ఈ పోస్టాఫీస్ పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ అత్యంత ఆదరణ పొందిందని చెప్పొచ్చు. దీంట్లో వడ్డీ రేటు మాత్రం ప్రస్తుతం వార్షిక ప్రాతిపదికన 7.10 శాతంగా ఉంది. ఇది ఎప్పటినుంచో పెరుగుతుందన్న వాదన వినిపించినా.. పెరగట్లేదు. కొత్త సంవత్సరం వేళ ఇక్కడ వడ్డీ రేటు పెరుగుతుందని చూసిన వారికి నిరాశే కలిగింది. చివరిసారి కేంద్రం.. 2024 జనవరి- మార్చి త్రైమాసికంలో సుకన్య సమృద్ధి పథకం, మూడేళ్ల టెన్యూర్ పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ వడ్డీ రేట్లను మాత్రమే పెంచింది. తర్వాత అప్పటినుంచి దాదాపు ఏడాది గడుస్తున్నా ఒక్క పథకం వడ్డీ రేటును కూడా మార్చలేదు.
'పీపీఎఫ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సుకన్య సమృద్ధి యోజన వంటి స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లు.. జనవరి- మార్చి త్రైమాసికానికి యథాతథంగానే ఉండనున్నాయి.' అని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పినట్లు పీటీఐ ద్వారా తెలిసింది. మరోవైపు ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న సుకన్య సమృద్ధి యోజన సహా సీనియర్ సిటిజెన్ల కోసం ఉన్న సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) వడ్డీ రేట్లు ప్రస్తుతం 8.20 శాతంగా ఉండగా.. ఇదే అత్యధికం అని చెప్పొచ్చు. అయితే కొన్ని త్రైమాసికాలుగా ఈ పథకాల్లో వడ్డీ రేట్లు ఏం మారట్లేదు.
పీపీఎఫ్‌లో ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500 ఇన్వెస్ట్ చేయొచ్చు. వరుసగా 15 ఏళ్లు కట్టాలి. సుకన్య సమృద్ధి యోజనలో మాత్రం రూ. 250 తోనే అకౌంట్ తెరవొచ్చు. వీటిల్లో గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. SCSS లో కూడా కనీసం రూ. 1000 ఉంటే చాలు. గరిష్టంగా రూ. 30 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. పాత పన్ను విధానంలో వీటిల్లో ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.