బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరిదైన ఐదో టెస్టులో భారత బ్యాటర్లు మరోసారి విఫలం కావడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే, భారత జట్టు ఈ మాత్రం స్కోరైనా చేసిందంటే దానికి కారణం రిషభ్ పంత్. ఇవాళ్టి మ్యాచ్‌లో 40 పరుగులతో మనోడు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్ల నుంచి దూసుకొచ్చిన పదునైన బంతులు తనను పలుమార్లు గాయపరిచాయి. అనేక బంతులు అతని శరీరానికి బలంగా తగిలాయి. కొన్ని దెబ్బలకు అతను ఫిజియో నుంచి చికిత్స కూడా తీసుకున్నాడు. పేసర్ మిచెల్ స్టార్క్ విసిరిన బంతి పంత్ మోచేతిపైన తాకడంతో వెంటనే వాపు వచ్చేసింది. ఆ నొప్పితో పంత్ విలవిలలాడాడు. బంతి తగిలిన చోట పెద్ద మచ్చలా ఏర్పడింది. వెంటనే సిబ్బంది వచ్చి చికిత్స అందించారు. ఆ తర్వాత పంత్ తిరిగి ఆటను కొనసాగించాడు. దాటిగానే బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే కొత్త బౌలర్ వెబ్‌స్టర్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదాడు. లాంగ్ ఆన్ మీదుగా పంత్ ఆడిన ఈ భారీ షాట్ మ్యాచ్‌కే హైలైట్ అని చెప్పాలి. ఇక సిక్స్ కొట్టిన బంతి సైట్ స్క్రీన్‌పై చిక్కుకుంది. దాంతో గ్రౌండ్ స్టాఫ్ నిచ్చెన వేసుకుని మరీ ఆ బంతిని తీశారు. దీని తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన భారత అభిమానులు పంత్‌తో పెట్టుకుంటే మాములుగా ఉండదు మరి అని కామెంట్ చేస్తున్నారు.