యువ క్రికెటర్ కరుణ్ నాయర్ సంచలన రికార్డు నమోదు చేశాడు. లిస్ట్ ఎ క్రికెట్‌లో నాటౌట్‌గా నిలుస్తూ అత్యధిక పరుగులు (542) చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారిస్తున్న 33 ఏళ్ల ఈ ఆటగాడు.. వరుసగా మూడో సెంచరీ నమోదు చేయడం ద్వారా ఈ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ (527 పరుగులు) పేరిట ఉండేది.
కరుణ్ నాయర్ 2016లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో ట్రిపుల్ సెంచరీ బాది క్రికెట్ ప్రపంచం దృష్టిని తనవైపునకు తిప్పుకున్నాడు. భారత్ తరఫున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన అతి కొద్ది మంది ఆటగాళ్ల జాబితాలో చేరిన కరుణ్ నాయర్.. టీమిండియాకు దూరమై చాలాకాలమే అయింది. తాజాగా విదర్భ జట్టు కెప్టెన్‌గా సెంచరీల మోత మోగిస్తూ తిరిగి వార్తల్లో నిలిచాడు.
విజయ్ హజారే ట్రోఫీలో గత 4 మ్యాచ్‌ల్లో కరుణ్ నాయర్ నాటౌట్‌గా నిలిచాడు. డిసెంబర్ 23న జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో 112 పరుగులు (నాటౌట్) చేశాడు. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్‌పై 44 పరుగులు (నాటౌట్), చంఢీగఢ్‌పై 163 పరుగులు (107 బంతుల్లో, నాటౌట్), తమిళనాడుపై 111 పరుగులు (103 బంతుల్లో, నాటౌట్) చేశాడు. కరుణ్ నాయర్ సారథ్యంలోని విదర్భ జట్టు ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడం విశేషం.
ఇక శుక్రవారం (జనవరి 3) ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 112 పరుగులు (101 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేశాడు కరుణ్ నాయర్. తద్వారా ఈ హ్యాట్రిక్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలోనే ఫ్రాంక్లిన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఆ తర్వాత కాసేపటికే ఔటయ్యాడు.