టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్, రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విబేధాలు తలెత్తాయా? వారిద్దరూ మాట్లాడుకోవడం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అప్పట్లో ఛాపెల్- సౌరవ్ గంగూలీ, కొన్నేళ్ల కిందట అనిల్ కుంబ్లే- విరాట్ కోహ్లీ.. మధ్య విబేధాలు భారత క్రికెట్‌లో పెను సంచలనం సృష్టించాయి. తాజాగా గంభీర్-రోహిత్ ద్వయం కూడా ఆ దిశగానే నడుస్తున్నట్లు తెలుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జట్టు ప్రదర్శన నేపథ్యంలో వీరిద్దరి మధ్య విబేధాలు తలెత్తినట్లు సమాచారం.
సంకేతాలు ఇవేనా..
సిడ్నీ టెస్టుకు ఒకరోజు ముందు అంటే.. గురువారం భారత జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. అయితే మధ్యాహ్న సమయంలో కోచ్ గంభీర్.. జస్‌ప్రీత్ బుమ్రాతో కలిసి పిచ్‌ను పరిశీలించాడు. కాసేపటి తర్వాత రోహిత్ కూడా వారితో కలిశాడు. కానీ ఈ సమయంలో గంభీర్, రోహిత్ మాట్లాడుకోలేదని తెలుస్తోంది. మ్యాచ్‌కు ముందు జరిగే విలేకర్ల సమావేశానికి కూడా కోచ్ గంభీర్ ఒక్కడే హాజరవడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. ఆ సమావేశంలో మాట్లాడిన గంభీర్.. ఆటగాళ్ల ప్రదర్శనే తుది జట్టుకు ఎంపికయ్యేందుకు ప్రామాణికమని చెప్పుకొచ్చాడు.
గంభీర్ మొండిపట్టు..
కాగా రోహిత్ శర్మను ఐదో టెస్టులో ఆడించాలని బీసీసీఐలో పేరున్న వ్యక్తి ఒకరు గంభీర్‌కు సూచినట్లు తెలుస్తోంది. సిడ్నీ టెస్టు తర్వాత రోహిత్ టెస్టు ఫార్మాట్ నుంచి వీడ్కోలు పలికే అవకాశం కల్పిస్తే బాగుంటుందని సదరు వ్యక్తి చెప్పాడట. కానీ గంభీర్ మాత్రం అందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ సిరీస్ కీలకమని.. తాను ఆటగాళ్ల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న రోహిత్‌శర్మ చివరి టెస్టుకు విశ్రాంతి తీసుకున్నాడు. రోహిత్ తనంతట తానుగానే పక్కకు వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు టాస్ సమయంలో కెప్టెన్ బుమ్రా చెప్పుకొచ్చాడు. అయితే రోహిత్ శర్మ.. మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడతాడా? లేదా అన్నది తేలాల్సి ఉంది. సిడ్నీ టెస్టు తర్వాత దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.