బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అదరగొడుతున్నాడు. అతడి బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా బ్యాటర్లు బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలోనే మెల్‌బోర్న్ టెస్టు తర్వాత బుమ్రా ఓ అరుదైన రికార్డును సాధించాడు. ఈ టెస్టు మ్యాచ్ తర్వాత ఐసీసీ.. టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇందులో 907 రేటింగ్ పాయింట్లతో బుమ్రా.. నంబర్ వన్ స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డును బుమ్రా సాధించాడు.
బుమ్రా ఖాతాలో ప్రస్తుతం 907 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. దీంతో ఐసీసీ అత్యధిక రేటింగ్ పాయింట్లు కలిగిన భారత బౌలర్‌గా బుమ్రా చరిత్ర సృష్టించాడు.మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో బుమ్రా తొమ్మిది వికెట్లు పడగొట్టి తన పాయింట్లను మెరుగుపర్చుకున్నాడు. మొత్తంగా ఆస్ట్రేలియాతో తొలి నాలుగు టెస్టుల్లో బుమ్రా 30 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా అతడి రేటింగ్ పాయింట్లు.. 907కి పెరిగాయి. రెండో స్థానంలో ఉన్న జోష్ హేజిల్ వుడ్ (843)కు బుమ్రాకు మధ్య 64 రేటింగ్ పాయింట్లు తేడా ఉండటం గమనార్హం.
బుమ్రా కంటే ముందు.. అత్యధిక రేటింగ్ పాయింట్లు కలిగిన భారత బౌలర్‌గా రవి చంద్రన్ అశ్విన్ ఉన్నాడు. 2016 డిసెంబర్‌లో రవి చంద్రన్ అశ్విన్.. 904 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. తాజాగా అంతకంటే 3 పాయింట్లు ఎక్కువే సాధించి.. బుమ్రా ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక మెల్‌బోర్న్ టెస్టుతో టెస్టుల్లో 200 వికెట్లు పడగొట్టిన బౌలర్‌ల జాబితాలో బుమ్రా చేరిపోయాడు. భారత్ తరఫున అత్యంత వేగంగా 200 టెస్టు వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో బుమ్రా రెండోస్థానంలో ఉన్నాడు. బుమ్రా 44 టెస్టుల్లో ఈ ఫీట్ సాధించగా.. అశ్విన్ 37 టెస్టుల్లో 200 వికెట్ల క్లబ్‌లో చేరి.. మొదటి స్థానంలో ఉన్నాడు.
ఇక అత్యధిక రేటింగ్ పాయింట్లు కలిగి ఉన్న బౌలర్ల జాబితాలో బుమ్రా 17వ స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ మాజీ పేసర్ డెరెక్ అండర్ వుడ్ (907)తో కలిసి సంయుక్తంగా 17వ ప్లేసులో ఉన్నాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ సిడ్నీ బర్న్స్ (932) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత జాబితాలో జార్జ్ లోహ్మాన్ (931), ఇమ్రాన్ ఖాన్ (922), ముత్తయ్య మురళీధరన్ (920)లు ఉన్నారు.