రాష్ట్రంలోని విద్యార్థులకు ఇబ్బందులు తొలగించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కాలేజీ యాజమాన్యాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయనుంది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులలో కొంత మొత్తం ముందస్తుగా విడుదల చేసి కాలేజీ యాజమాన్యాలకు భరోసా కల్పించాలని ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టకుండా చూడాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించారు.
గత టీడీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విద్యార్థులు చదువుతున్న కళాశాలల యాజమాన్యాల ఖాతాల్లోనే జమచేసేది. అయితే 2019 ఎన్నికల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఈ విధానాన్ని మార్చింది. కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేసే విధానం తెచ్చారు. ఆ తర్వాత విద్యార్థులు, తల్లుల పేరిట జాయింట్ బ్యాంక్ ఖాతాలు తెరిపించి అందులో జమ చేయడం మొదలెట్టారు. విద్యార్థుల తల్లులు ఆ తర్వాత ఈ మొత్తాన్ని కాలేజీ యాజమాన్యాలకు చెల్లించాల్సి ఉండేది. అయితే వైసీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులు బకాయిలు పెట్టడంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. చదువు పూర్తి చేసుకున్న విద్యార్తులకు కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికేట్లు అందించని పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారం సమయంలో తాము అధికారంలోకి వస్తే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. నారా లోకేష్ సైతం యువగళం పాదయాత్రలో ఇదే విషయంపై విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ కూటమి సర్కారు దీనిపై ప్రకటన చేసింది. మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి శాసనమండలి వేదికగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కొనసాగిస్తామని ప్రకటించారు, అయితే వైసీపీ సర్కారు అనుసరించిన విధానం తరహాలో కాకుండా నేరుగా కాలేజీ యాజమాన్యాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు చెల్లిస్తామని తెలిపారు,
ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో మంత్రి నారా లోకేష్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు, కాలేజీలకు భరోసా కల్పించేలా ప్రాధాన్య క్రమంలో ముందస్తుగా కొంచెం మొత్తం విడుదల చేయాలని కోరారు. దీనికి మంత్రిమండలి, సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ఈ క్రమంలోనే విడతల వారీగా నిధులు చెల్లింపులో భాగంగా ముందుగా కొన్ని నిధులు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలాగే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.