అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఏపీటీఏ) క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్-2025 కార్యక్రమానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. "ఆప్తా (ఏపీటీఏ) ఆధ్యర్యంలో ఈ క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కాన్ఫరెన్స్ కు విచ్చేసిన అతిరథ మహారథులు, దేశ విదేశాల నుంచి, ముఖ్యంగా అమెరికా నుంచి వచ్చి ఈ హైదరాబాదులో తెలుగువారిని కలుసుకుంటూ, తెలుగువారిలో ఉన్న యంగ్ ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించేందుకు ఆసక్తి చూపడం అభినందనీయం. ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉంటే ఆ వచ్చే రిజల్ట్ వేరేగా ఉంటుంది. ఆ రిజల్ట్ మనకే కాకుండా మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి, మనం ఉండే ఇతర దేశాలకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. అటువంటి విశాలమైన దృక్పథంతో నేడు ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఇంతమంది మధ్య ఇంత ఎలక్ట్రిఫైయింగ్ గా, ఎనర్జటిక్ గా సమావేశం కావడం చూస్తుంటే... మీరు ఆప్తా సభ్యులు కాదు నా ఆప్తులు అనిపిస్తోంది. అలాంటి ఆప్తులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కొన్ని సభలకు వెళ్లినప్పుడు ఏదో మొక్కుబడిగా అనిపిస్తుంటుంది. కానీ ఇలాంటి చోటకు వచ్చినప్పుడు నా కుటుంబ సభ్యుల మధ్యకు వచ్చినట్టు ఉంటుంది. ఓ పండుగను పురస్కరించుకుని నన్ను ఆహ్వానించడం ఎంతో ఆహ్లాదంగా ఉంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరిలోనూ, నా మీద వారికున్న అభిమానం, ఈ తెలుగు మీదున్న అభిమానం, ఈ దేశం మీదున్న అభిమానం ప్రతి ఒక్కరి కళ్లలో సుస్పష్టంగా కనిపిస్తోంది. నాకిస్తున్న ఈ అద్భుతమైన స్వాగతానికి శిరసు వంచి నమస్కరిస్తున్నా. ఇంతటి అత్యద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముందు ధైర్యం కావాలి. అమెరికా నుంచి వచ్చి ఇక్కడ పదిమందిని కలవగలమా? మన ఆహ్వానాన్ని మన్నించి ఇంతమంది వస్తారా? మనం అంతర్యాన్ని, మన ధ్యేయాన్ని అర్థం చేసుకుని వస్తారా? అనే వీళ్ల అనుమానాలను పటాపంచలు చేస్తూ, ఇంతమంది తరలిరావడం ఈ సభను ఏర్పాటు చేసిన యువతకు ఎనలేని ఉత్సాహాన్ని ఇస్తుంది. వాళ్లను ఉత్సాహపరచాలి, ఎంతో మంది ఔత్సాహికులకు ఇది ఊతంగా ఉండాలి, భవిష్యత్తులో వాళ్లు ఉన్నత స్థాయికి ఎదగాలన్న సదుద్దేశంతో ఆప్తా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం. ఇలాంటి కార్యక్రమానికి రాకుండా ఎలా ఉండగలం? యువ పారిశ్రామికవేత్తలకు మీరు ఏదైనా చెప్పాలి అని సభ నిర్వాహకులు నన్ను కోరారు. కానీ ఎంట్రప్రెన్యూర్ అనే పదానికి సరిగా స్పెల్లింగ్ కూడా నాకు తెలియదు... అలాంటిది వారికి నేనేం చెప్పగలను అనిపించింది. ఆ తర్వాత ఆలోచిస్తే... ఎడ్యుకేషనిస్టులు, కార్యసాధకులు చెప్పే అంశాలన్నీ నాలో అంతరాంతరాల్లో ఉన్నాయేమో అని అనిపించింది. ఆ అంశాలన్నీ నాలో అంతర్లీనంగా ఉంటూ, నన్ను ముందుకు నడిపించడం వల్ల... జీవితంలో ఎలాంటి అవకాశాలు లేని స్థితి నుంచి ఈ స్థాయి వరకు వచ్చానేమో అనిపించింది. అందుకే నా జీవితంలోని అంశాలను మీరు మీ ఎంట్రప్రెన్యూర్ షిప్ కు అన్వయించుకుంటారని ఆశిస్తున్నాను. నా గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సాదా సీదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడు ఏదో ఒకటి సాధించాలని ఉండేది. ఎలా అని ఆలోచిస్తే... గేమ్స్ అని తట్టింది. చదువు అంటే కష్టం కానీ, ఆటలు అంటే ఎవరికిష్టం ఉండదో చెప్పండి. బాల్ బ్యాడ్మింటన్ ఆడితే, ఒకరు బలంగా కొట్టిన బంతి నా కంటికి తగిలి కన్ను వాచిపోయింది. మళ్లీ నేను ఆ గేమ్ వైపు వెళ్లలేదు. సరే, వాలీబాల్ ఆడదామని వెళితే... అవతలి ఆటగాడు బలంగా స్మాష్ కొడితే నేను వేళ్లతో ఆడే ప్రయత్నం చేశాను. దాంతో వేళ్లు వంగిపోయాయి. ఆ విధంగా వాలీబాల్ అంటే భయం ఏర్పడింది. ఇక క్రికెట్ ఆడితే బొటనవేలుకు బంతి తగిలింది. దాంతో గేమ్స్ మనకు అచ్చిరావని ఓ నిర్ణయానికి వచ్చాను. ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్న నాకు ఆ సమయంలో ఎన్.సి.సి కనిపించింది. ఎన్.సి.సిలో క్రమశిక్షణ ఉంటుంది... ఇది జీవితానికి మంచిది అనిపించింది. ఆ తర్వాత నేవల్ ఎన్.సి.సి క్యాడెట్ అయ్యాను, మరుసటి ఏడాదే పెట్టీ ఆఫీసర్ గా ఎదిగాను. క్యాడెట్ కెప్టెన్ అయ్యాను, థర్డ్ ఇయర్ లో సీనియర్ క్యాడెట్ కెప్టెన్ అయ్యాను... అవడమే కాదు, ఢిల్లీలో రాష్ట్రపతి రోడ్ లో మన సైన్యంతో పాటు కవాతులో పాల్గొన్నాను. అప్పట్లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నారు. ఓపక్క ప్రధాని, మరో పక్క రాష్ట్రపతి... ఇలా అందరి ముందు కవాతులో నడుస్తూ ఉంటే... ఇది కదా మనం సాధించింది అని ఎంతో గర్వంగా అనిపించింది. ఎన్.సి.సి తర్వాత ఇంకేంటి అని ఆలోచిస్తే ఏ దారి కనిపించలేదు. సైన్యంలోకి వెళితే ఏదో ఒక ఆఫీసర్ ను అవుతాను. కానీ ఇంకేదో సాధించాలని అనిపించింది. ఆ సమయంలో కాలేజీలో రాజీనామా అని ఒక డ్రామాలో యాక్ట్ చేశాను. అందులో నా నటనకు బెస్ట్ యాక్టర్ ప్రైజ్ వచ్చింది. ఫొటో తీసి కాలేజి మ్యాగజైన్ లో వేశారు. ఆ తర్వాత నుంచి నేను ఎక్కడికి వెళ్లినా సరే అమ్మాయిలు, తోటివారు నన్నో హీరోలా చూస్తున్నారు. రాత్రి డ్రామాలో చైర్మన్ గా ఎంత బాగా నటించావు అంటూ ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా అందమైన అమ్మాయిలు అలా చూస్తూ ఉంటే ఇంకా ఖుషీగా అనిపించేది. అది చాలా ఎంకరేజింగ్ గా ఉండేది. యాక్టింగ్ ను నా ఫ్యూచర్ గా తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనకు అక్కడే బీజం పడింది. అక్కడ్నించి నాలో ఆసక్తి పెరిగింది. సినిమాలు బాగా చూసేవాడ్ని. డిగ్రీ అయిపోయిన తర్వాత ఏంచేయాలని మా నాన్నతో చర్చించాను. మా నాన్న సినిమాల్లో చాలా చిన్న రోల్స్ చేశారు. అవి నిమిషం కూడా ఉండే పాత్రలు కావు. మనకు మద్రాసులో ఎవరూ తెలియదు కదా ఎలా... అన్నారాయన. కచ్చితంగా నిలబడతాను అని ఏదో తెలియని గట్టి నమ్మకం ఉండేది. ఏ బ్యాంకు ఉద్యోగిగానో, నాన్న గారిలా పోలీసుగానో, నేవీ ఆఫీసరో అవుదామా అనుకుంటే ఆ ఆలోచన కిక్ ఇవ్వడంలేదు. అదే, సినిమా యాక్టర్ అవుదాం అనుకోగానే ఎక్కడలేని ఉత్సాహం కలిగింది. అప్పటి నుంచి సినిమాలపై దృష్టి సారించాను. ముందుగా ఫిలిం ఇన్ స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను. నాలో ఉన్న ప్రతిభను గుర్తించిన దర్శక నిర్మాతలు... నేను ట్రైనింగ్ పూర్తి చేసుకోకముందే నాకు వేషాలు ఇవ్వడం మొదలుపెట్టారు. నా ఫొటోలు తీసుకుని నేను ఏ ఆఫీసుల చుట్టూ తిరగలేదు, ఏ ఆడిషన్ కు వెళ్లలేదు. కానీ ఒకటే ధ్యేయం! ఉన్నతస్థానానికి ఎదగాలి. అప్పటికే అవకాశాల కోసం తిరిగి తిరిగి ఉన్న వాళ్లు, నిరాశా నిస్పృహలతో ఉండేవాళ్లు మద్రాసులో ఎక్కువగా కనిపించే ప్రాంతం పాండీ బజార్. నేను టీ తాగడానికి అక్కడికి వెళితే... ఏంటి, కొత్తగా వచ్చావా అన్నారు. అవును సినిమాల్లో అవకాశాల కోసం ఫిలిం ఇన్ స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాను అని చెప్పాను. దాంతో వాళ్లు కొంత అవమానకరంగా మాట్లాడారు. ఎప్పటినుంచో ఉన్న మాకే దిక్కులేదు... నువ్వేం రాణిస్తావు అన్నారు. దాంతో నేను ఎంతో నిరాశకు గురయ్యాను. కానీ, ఆంజనేయస్వామి చలవతో ఆ పరిస్థితిని అధిగమించాను. ఆంజనేయస్వామి నాతో మాట్లాడుతున్నట్టే ఉండేది. నెగెటివిటీ ఉండే ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్లావు... నీలోని పాజిటివ్ అంశాలకు మరింత ప్రోద్బలం అందించే చోటుకు వెళ్లు అని ఆంజనేయస్వామి చెప్పినట్టు అనిపించింది. అక్కడ్నించి నేను వెనుదిరిగి చూసుకోలేదు. ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఎలాంటి నెగెటివిటీకి స్థానం ఇవ్వకూడదు. నీ లక్ష్యమే నీకు ప్రధానం... నీ మనసునే నమ్ముకోవాలి... కళ్లకు గంతలు కట్టిన గుర్రంలా పక్కకు చూడకుండా ముందుకే దూసుకుపోవాలి. సినిమా రంగంలో నెంబర్ వన్ అవ్వాలన్నదే నా లక్ష్యం. నేను ఎలాంటి చెడు అలవాట్లకు గురికాలేదు. కొన్ని అవమానాలు ఎదురైనా వాటిని కూడా నాకు అనుకూలంగా మార్చుకున్నాను. అప్పటికే మానసికంగా రాటుదేలిన నన్ను ఆ అవమానాలు ఏమీ చేయలేకపోయాయి. అప్పట్లో ఎన్టీఆర్ గారితో తిరుగులేని మనిషి అనే సినిమాలో చేశాను. ఆ సినిమా ఫెయిలైంది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ తో మరో సినిమా చాన్స్ వచ్చింది. డేట్స్ అన్నీ కుదిరాయి అనుకునే సమయంలో మరొకరి పేరును అనౌన్స్ చేశారు. మీ కాంబినేషన్ ఫెయిల్ అయింది కదండీ... అందుకే మిమ్మల్ని వద్దనుకున్నాం అని ఆ సినిమా వాళ్లు చెప్పారు. నేను సినిమా చేస్తే అది ఫెయిల్ అవుతుందేమో అని చెడు ప్రచారం జరుగుతుందేమో అని భయపడ్డాను. అయితే దాన్ని కూడా నేను పాజిటివ్ గానే తీసుకున్నాను. ఆ సినిమా తీసిన వ్యక్తి రామారావు గారితో కంటే నాతోనే ఎక్కువ సినిమాలు చేసే స్థాయికి ఎదిగాను. రామారావుతో ఆయన చాలా సినిమాలు చేశారు... ఆ దర్శకుడు నా భుజం పట్టి నడిపించి, రామారావుతో కంటే నాతో నాలుగు సినిమాలు ఎక్కువే తీశారు. పరిస్థితులను ఆ విధంగానే మలుచుకోవాలి. ఎదురైన అవమానాన్ని నెగెటివిటీగా మలుచుకుంటే అది నిన్నే తినేస్తుంది. దాంతో దిగజారిపోతావు, కనుమరుగైపోతాయి. ఆకాశంలో ఎగిరే గ్రద్దనే నేను స్ఫూర్తిగా తీసుకుంటాను. ఆయన సినిమాలతోనే నా రికార్డులు ఉన్నాయి. అప్పట్లో నా సినిమా కోటి రూపాయలు సాధించింది. అది కూడా ఆయనతోనే. ఓ తెలుగు సినిమా కోటి రూపాయలు సాధించడం అదే ప్రథమం. అక్కడ్నించి కోటి రూపాయలు అనేది మామూలు విషయం అయింది. నేను చెప్పేది ఒక్కటే... మీ లక్ష్యం ఏమిటనేది ఫిక్స్ చేసుకోండి.. పాజిటివ్ గా ముందుకెళ్లండి... అవకాశాలు ఎన్నో కనిపిస్తుంటాయి... మనకు తగిన అవకాశం ఏంటనేది ఎంచుకుని ముందుకు వెళ్లాలి. ఆ సమయంలో డబ్బు ముఖ్యం కాదు. ఎదిగే క్రమంలో డబ్బు అదే వస్తుంది. నేను ఎక్కడా ఇగో చూపించలేదు. నన్ను బాధపెట్టిన వాళ్లు కూడా, అరే ఇతడ్ని మనం బాధ పెట్టామా, ఇతడితో మనం సినిమా తీయాలి అనుకునేలా నా ప్రవర్తన ఉండేది. నాకు పౌరుషం లేక కాదు. కానీ నేను తగ్గి ఉండడం వల్ల, ఆ తర్వాత వచ్చే కరెంటు వేవ్స్ మీదికి ఎక్కితే అవే తీసుకెళ్లాయి పైకి. సినిమా రంగంలో తొలినాళ్లలో టాలెంట్ కంటే ముందు మన ప్రవర్తన చాలా ముఖ్యం. దర్శకనిర్మాతల ప్రయోజనాలకు మనం ఎలా ఉపయోగపడగలమన్నదే చాలా ముఖ్యం. రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినీ రంగంలో వచ్చిన గ్యాప్ లో ఒక కొత్తవాడు నిలదొక్కుకోవడం అనేది చాలా కష్టం. ఆ సమయంలో అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు.. ఇలా ఎంతో మంది ఉన్నారు. ఈ రోజుల్లో అయితే అలాంటి గ్యాప్ లో కొత్తవాళ్లు నిలదొక్కుకోలేరు. టాలెంట్ కంటే బిహేవియర్ చాలా ముఖ్యం. ఇది జీవితంలో ఏ రంగానికైనా వర్తిస్తుంది. ఇండస్ట్రీ కంటే ముందు నన్ను ప్రేక్షకులు గుర్తించారు. అందుకే ప్రేక్షకులకు నేను రుణపడి ఉంటాను" అని చిరంజీవి వివరించారు.