దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 172 పాయింట్లు పెరిగి 79,389 వద్ద ట్రేడవుతోంది.నిఫ్టీ 43 పాయింట్లు పెరిగి రూ.24,048 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.78గా ఉంది. నిఫ్టీ సూచీలో టైటాన్ కంపెనీ, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, టీసీఎస్ షేర్లు లాభాల్లో కదలాడుతుండగా.. కొటక్ మహీంద్రా, ఓఎన్జీసీ, టాటా స్టీల్, సిప్లా సంస్థల షేర్లు నష్టాల్లో ఉన్నాయి.విదేశీ పెట్టుబడిదార్ల ధోరణి, గురువారం నుంచి ప్రారంభం కాబోతున్న దేశీయ కార్పొరేట్ సంస్థల ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్లకు దిశానిర్దేశం చేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. డిసెంబరు త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో, సూచీలపై కొందరు విశ్లేషకులు సానుకూలంగా ఉన్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ విధానాలపై ఇంకా స్పష్టత లేకపోవడం, మన షేర్లు అధిక ధరల్లో ఉన్నాయన్న అభిప్రాయం వల్ల మార్కెట్లు రాణించకపోవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.