నంద్యాలలోని ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికలకు తమ కళాశాల విద్యార్థులు 177మంది ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసప్రసాద్ గురువారం తెలిపారు. కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అంతర్జాతీయ సంస్థ ఓ ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులు నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో విద్యార్థుల నైపుణ్యాలు, సామర్థ్యాలను అంచనావేసేందుకు పోటీ పరీక్ష, ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించారన్నారు. ఈ ప్రక్రియలో మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి 37 మంది, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ర్టానిక్స్ ఇంజనీరింగ్ నుంచి 69మంది, ఎలక్ర్టికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ నుంచి 71మంది మొత్తం 177మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. ఎంపికైన వీరికి రూ.17,500 వేతనంతో పాటు ఇతర అలవెన్స్‌లను చెల్లిస్తారని చెప్పారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ప్రవీణ్‌కుమార్, ఒణియాన్, కళాశాల ప్లేస్మెంట్ కో ఆర్డినేటర్లు ఈశ్వరయ్య, షఫీ, షరీఫ్, వివిధ విభాగాల హెచ్ఓడీలు పాల్గొన్నారు.