రోజురోజుకూ టెక్నాలజీ పెరుగుతున్నట్లే వాటి వాడకంతో సమస్యలు సైతం పెరుగుతున్నాయి. ముఖ్యంగా పరిసరాల్లో కలిసిపోయేలా ఉండే అతిచిన్న రహస్య కెమెరాలతో మన జీవితాలకు ప్రైవసీ ముప్పు పొంచి ఉంది. ఎక్కువగా హోటళ్లలో దిగే టూరిస్టులను ఈ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. అయితే కాస్త తెలివిగా వ్యవహరిస్తే సీక్రెట్ కెమెరాలను గుర్తించడం సులువే. అదెలాగో తెలుసుకుందాం.హోటల్ గదిలోకి వెళ్లగానే గదిని మొత్తం తనిఖీ చేయండి. బాత్రూంలో, బెడ్రూంలో, వరండాలో అసాధారణంగా ఏమైనా వస్తువులు ఉన్నాయా అని పరిశీలించండి. ఉండాల్సిన చోట కాకుండా మరో చోట వాటిని పెట్టారా అని చూడండి.రోజువారీ వస్తువుల్లో కలిసిపోయేలా స్పై కెమెరాలను కేటుగాళ్లు అమరుస్తుంటారు. అందుకే లైట్లు, ఫొటో ఫ్రేమ్ లను పరిశీలించండి. అద్దాల వెనకాల, విద్యుత్ పరికరాలు, స్మోక్ డిటెక్టర్ల లోపల ఉన్నాయేమో చూడండి. గది మూలల్లో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయో లేదో ఫ్లాష్ లైట్ వేసి చూడండి. ఫ్లాష్ లైట్ వెలుతురులో సీక్రెట్ కెమెరాల్లోని లెన్సులు సాధారణ వస్తువులకన్నా భిన్నంగా పరావర్తనం చెందుతూ కనిపిస్తాయి.రహస్య కెమెరాల్లోంచి వెలువడే ఇన్ఫ్రారెడ్ కాంతిని గుర్తించే స్మార్ట్ ఫోన్ యాప్ లు చాలా ఉన్నాయి. వాటిని ఉపయోగిస్తూ గది మొత్తాన్ని స్కాన్ చేయండి.సీక్రెట్ కెమెరాల నుంచి వెలువడే వైర్ లెస్ సిగ్నల్స్ ను గుర్తించేందుకు పోర్టబుల్ రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్ ఎఫ్) డిటెక్టర్ ను వాడండి. ఇవి కెమెరా పరికరాల్లోని ఫ్రీక్వెన్సీలను గుర్తిస్తాయి.గదిలో అనవసరంగా వైర్లు లేదా కేబుళ్లు ఉన్నాయేమో పరిశీలించండి. కెమెరాలను వాటి పవర్ సోర్స్ లకు లేదా రికార్డింగ్ పరికరాలకు అనుసంధానం చేయడానికి ఆ వైర్లను వాడుతుండవచ్చు.హోటల్ లో పబ్లిక్ వైఫై నెట్ వర్క్ లను వాడకండి. వైఫై నెట్ వర్క్ స్కానర్ ఉపయోగించి పరిసరాల్లోని వైఫై నెట్ వర్క్ లను స్కాన్ చేయండి. అనుమానాస్పద నెట్ వర్క్ లు ఏవీ లేవని నిర్ధారించుకోండి.అనుమానాస్పదంగా కనిపించే వస్తువులు లేదా కెమెరాలు దాచి ఉంచే అవకాశం ఉన్న పరికరాలను చేత్తో తాకి చూడండి. వాటి లోపల ఏమైనా డొల్లగా ఉంటూ శబ్దం వస్తోందేమో గమనించండి.గదిలో లైట్లు మొత్తంగా ఆఫ్ చేసి, ఎక్కడైనా చిన్నగా అయినా ఏమైనా మెరుస్తున్నట్టుగా లేదా పరావర్తనం చెందుతున్నట్టుగా ఉందా అన్నది పరిశీలించండి.గదిలో ఏమైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని అనుమానం వస్తే వెంటనే భద్రతా నిపుణులను పిలిచి గదిని ఆసాంతం తనిఖీ చేయించండి. తప్పుడు ఉద్దేశంతో పెట్టే కెమెరాలు, ఇతరాలు ఏవైనా బయటపడే అవకాశం ఉంటుంది.