రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ షేర్లు భారీగా పడిపోతున్నాయి. వరుసగా నాలుగో సెషన్లోనూ నష్టాల్లో ముగిశాయి. ఈ క్రమంలో జియో ఫైనాన్షియల్ షేరు ధర 11 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. సోమవారం ఉదయం రూ. 277.80 వద్ద ప్రారంభమైన స్టాక్.. మార్కెట్లు ముగిసే నాటికి 5.26 శాతం మేర నష్టపోయి రూ. 265.80 వద్ద ముగిసింది. గత ఐదు సెషన్లలో ఈ స్టాక్ 11 శాతం మేర పడిపోవడం గమనార్హం. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 1.69 లక్షలకు పడిపోయింది. ఇక ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 394 వద్ద ఉండగా, కనిష్ఠ ధఱ రూ. 237 గా ఉంది.
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ స్టాక్ ఇటీవల భారీగా పడుతోంది. 5 రోజులు, 20 రోజులు, 50, 100, 200 రోజుల మూవింగ్ యావరేజ్ చూసుకుంటే అంతకంటే తక్కువ స్థాయిలో ట్రేడవుతుండడం గమనార్హం. దీంతో ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు వచ్చాయని చెప్పవచ్చు. టెక్నికల్‌గా ఈ స్టాక్ బలహీనంగా కన్పిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు ఈ స్టాక్ అమ్మేయడమే బెటర్‌గా సూచించారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ప్రస్తుత ధర వద్ద ఈ స్టాక్ కొనసాగించవచ్చని, భవిష్యత్తులో పుంజుకునే అవకాశాలు ఉంటాయని తెలిపారు.
జియో ఫైనాన్షియల్ స్టాక్ రూ. 270 వద్ద మద్దతు లభించే అవకాశం ఉందని, ఒకవేళ మద్దతు లభించకపోతే మరింత పడిపోయే ఛాన్స్ ఉందని తెలిపారు. రూ. 270 వద్ద నిలదొక్కుకుంటే స్టాక్ మళ్లీ వేగంగా రికవరీ అయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలంలో లాభాల అందుకోవాలనుకునే వారు ఈ స్టాక్ ట్రెండ్ గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని సూచించారు.
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ తమ ఈ ఆర్థిక సంవత్సరానికి చెందిన క్యూ3 ఫలితాలను జనవరి 17వ తేదీన ప్రకటించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఫలితాలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతోంది. క్యూ3 ఫలితాల్లో అంచనాలను అందుకుంటే స్టాక్ మళ్లీ ర్యాలీ చేయవచ్చని అంచనా. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ 2023, ఆగస్టులోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి వేరుపడింది. స్పెషల్ ట్రేడింగ్ నిర్వహించి ఈ స్టాక్ ధరను రూ. 261.85 గా నిర్ణయించారు. ఆ తర్వాత కొన్ని రోజుల్లో 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 394ని తాకింది.