ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు గాను కాంగ్రెస్ పార్టీ (Congress party) హామీల వర్షం కురిపించింది. తాము అధికారంలోకి వస్తే రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని తెలిపింది. అలాగే ప్రతి ఇంటికీ 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఫ్రీ రేషన్ కిట్స్ (Ration kits) అందిస్తామని పేర్కొంది. ఢిల్లీలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy) ఈ హామీలను ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో ఢిల్లీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. గతంలో మూడు సార్లు అధికారంలో ఉన్నప్పటికీ మోడీ, కేజ్రీవాల్ ప్రభుత్వాలు ఢిల్లీ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఇది కాంగ్రెస్ ప్రకటించిన నాలుగో హామీ కావడం గమనార్హం. అంతకుముందు మూడు హామీలను ప్రకటించింది. గతంలో ఇచ్చిన హామీల్లో మహిళలకు నెలకు రూ. 2,500 ఇవ్వడం, రూ. 25 లక్షల ఆరోగ్య బీమా, నిరుద్యోగ యువతకు ఏడాది పాటు నెలకు రూ. 8,500 స్టైఫండ్ అందజేయడం వంటివి ఉన్నాయి. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 5న జరగనుండగా అదే నెల 8న ఫలితాలు వెలువడనున్నాయి.