కర్ణాటకలోని బీదర్‌లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. నగరం నడిబొడ్డున శివాజీ చౌక్‌లోని ఓ ఏటీఎం కేంద్రంలో డబ్బు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులకు పాల్పడ్డారు.ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. దుండగులు ఏటీఎం సొమ్మును చేజిక్కించుకుని ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పారిపోయారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అతి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు.