దాడిలో గాయపడిన సినీ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పది బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో సైఫ్ ఇంటిని సందర్శించిన పోలీస్ అధికారుల్లో దయా నాయక్ కూడా ఉన్నారు. బాంద్రాలోని సద్గురు శరణ్ అపార్ట్‌మెంట్‌కు వచ్చిన ఆయన కేసు ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ముంబయి అండర్‌వరల్డ్‌ను గడగడలాడించిన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా దయా నాయక్‌కు పేరుంది.
ఇంతకీ ఎవరీ దయానాయక్..
కర్ణాటకలోని ఉడిపిలో కొంకణ్ మాట్లాడే కుటుంబంలో దయా నాయక్ జన్మించారు. స్థానికంగా ఏడో తరగతి వరకూ చదువుకున్నారు. ఆ తర్వాత ఆయన కుటుంబం 1979లో ఉపాధి నిమిత్తం ముంబయి వెళ్లిపోయింది. ఒకవైపు హోటల్‌లో పనిచేస్తూనే మరోవైపు స్థానిక మున్సిపల్ స్కూల్‌లో 12వ తరగతి పూర్తి చేశారు. అంధేరిలోని కాలేజ్‌లో సీఈఎస్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఎప్పటికైనా పోలీసు అవ్వాలన్న తన కలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేశారు. అనుకున్నట్లే 1995లో స్టేట్ పోలీస్ పరీక్షల్లో విజయం సాధించి, జుహు పోలీస్‌స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధుల్లో చేరారు. దయా నాయక్ ఉద్యోగంలో చేరిన సమయానికి ముంబయిలో అండర్‌వరల్డ్ పేరుతో విపరీతంగా దందాలు, హత్యలు, డ్రగ్స్, హవాలా సహా ఎన్నో నేరాలు జరిగేవి. ఈ క్రమంలోనే 1996లో చోటా రాజన్ గ్యాంగ్‌లోని ఇద్దరిని కాల్చి చంపడంతో దయా నాయక్ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ప్రజల్లోనే కాక, డిపార్ట్‌మెంట్‌లోనూ ఆ పేరు మార్మోగిపోయింది. అండర్ వరల్డ్ నెట్‌వర్క్‌కు సంబంధించి పనిచేస్తున్న దాదాపు 80 మందిని ఎన్‌కౌంటర్ చేసినట్లు సమాచారం.
ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా ఎంత పేరు సంపాదించారో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులోనూ దయా నాయక్ అంతే అపఖ్యాతి మూటగట్టుకున్నారు. ఏసీబీ ఆయన్ను విచారించి అరెస్ట్ కూడా చేసింది. మళ్లీ 2012లో అదనపు కమిషనర్‌గా (వెస్ట్) తిరిగి విధుల్లో చేరారు. ప్రస్తుతం సైఫ్ దాడి ఘటనను పరిశీలించడానికి వచ్చిన పోలీసుల్లో దయా నాయక్ కూడా ఉండటంతో ఆసక్తి నెలకొంది. దయా నాయక్ జీవిత కథ స్ఫూర్తితో హిందీతో పాటు, తెలుగులోనూ పలు చిత్రాలు వచ్చాయి.