ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో త్రైమాసిక ఫలితాలను శుక్రవారం మార్కెట్లు ముగిసిన తర్వాత ప్రకటించింది. డిసెంబర్ 31, 2024తో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీ ఏకంగా రూ.3,354 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఈసారి ఏకంగా 24.4 శాతం మేర నికర లాభం పెరిగింది. ఇక కంపెనీ ఆదాయం 0.5 శాతం వృద్ధితో రూ.22,319 కోట్లుగా ఉన్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. చివరి త్రైమాసికంలో 1 శాతం వృద్ధి నమోదు అంచనా వేసింది.
ఈ సందర్భంగా తమ షేర్ హోల్డర్లకు అదిరే శుభవార్త చెప్పింది టెక్ దిగ్గజం విప్రో. క్యూ3లో భారీ లాభాలు అందుకున్న క్రమంలో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ.6 చొప్పున డివిడెండ్ చెల్లిస్తామని తెలిపింది. ఇందుకు అర్హులైన షేర్ హోల్డర్లను నిర్ణయించేందుకు రికార్డ్ తేదీని జనవరి 28గా కంపెనీ బోర్డు నిర్ణయించినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో విప్రో తెలిపింది. అంటే జనవరి 28వ తేదీ నాటికి విప్రో షేర్లు కొనుగోలు చేసిన వారికి డివిడెండ్ పొందేందుకు అర్హత లభిస్తుంది. ఇక ఈ డవిడెండ్ డబ్బులను ఫిబ్రవరి 15వ తేదీ లోపు షేర్ హోల్డర్ల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపింది.
ఇక క్యూ3 ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఇవాళ్టి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్‌లో విప్రో షేర్లు నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే నాటికి 2.20 శాతం నష్టంతో రూ.281.70 వద్ద స్థిరపడింది. అయితే, క్యూ3లో మెరుగైన ఫలితాలు ప్రకటించిన క్రమంలో సోమవారం నాటి ట్రేడింగ్‌లో ఈ షేర్లు ఫోకస్‌లో ఉండే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ స్టాక్ డివిడెండ్ యీల్డ్ 0.18 శాతంగా ఉంది అలాగే పీఈ రేషియో 24.14 గా ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.2.95 లక్షల కోట్లుగా ఉంది. కంపెనీ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.320 వద్ద ఉండగా కనిష్ఠ ధర రూ.208.50 వద్ద ఉంది.