ప్రముఖ క్రీడాకారిణి మను భాకర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆదివారం ఉదయం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మను భాకర్ అమ్మమ్మ, మామ చనిపోయారు. హర్యానాలోని మహేంద్రగఢ్ బైపాస్ రోడ్డులో ఈ ఘోరం చోటుచేసుకుంది. మను భాకర్ అమ్మమ్మ, మామ ప్రయాణిస్తున్న బ్రెజ్జా కారు ఓ స్కూటీని ఢీ కొట్టింది. దీంతో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మను అమ్మమ్మ, మామ స్పాట్ లోనే చనిపోయారు. ప్రమాద సమయంలో కారును డ్రైవర్ నడుపుతున్నాడని, ప్రమాదం జరిగిన తర్వాత కారును వదిలేసి అతడు పారిపోయాడని పోలీసులు తెలిపారు.కాగా, పారిస్ లో గతేడాది జరిగిన ఒలింపిక్స్ లో మను భాకర్ రెండు పతకాలు గెల్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మను భాకర్ ను కేంద్ర ప్రభుత్వం ఖేల్ రత్న అవార్డుతో సత్కరించింది. రెండు రోజుల క్రితమే మను భాకర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. ఇంతలోనే ఈ ప్రమాదం జరగడం, అమ్మమ్మ, మామలను కోల్పోవడంతో మను భాకర్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.