అనంతపురం నగరంలో పరిశుభ్రత విషయంలో త్వరలోనే మార్పు చూస్తారని ఎమ్మెల్యే దగ్గు పాటి ప్రసాద్ అన్నారు. శనివారం నగరపాలిక ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నగరంలోని పాతూరులో నిర్వహించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న, కమిషనర్ మల్లికార్జునరెడ్డి, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, వాసంతి సాహిత్య, అధికారులు, నాయకులు హాజరయ్యారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించి కార్యక్రమం ప్రారంభించారు. స్వచ్ఛతపై ప్రజలు, సచివాల య సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం రోడ్లు ఊడ్చి, చెత్త ను ఎత్తి ట్రాక్టర్లలో వేశారు. అయితే స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్ కార్యక్రమం పాతూరులో షోను తలపించింది. వాస్తవానికి అపరిశు భ్రత ఎక్కువగా ఉన్న కాలనీల్లో కాకుండా పాతూరులోని తాడిపత్రి బస్టాండ్ రోడ్డులోని ప్రధాన రహదారిలో చేపట్టారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు చీపుర్లు పట్టుకుంటే ఊడ్చడానికి అక్కడ చెత్తలేకపో వడం గమనార్హం. అదేదో కీలకమైన ప్రజాప్రతినిధులు, అధికారులకే సంబంధమున్నట్లు, వారు చేస్తుంటే వీరు చూస్తుండిపోవడంపై పలు విమర్శలు వినిపించాయి.