కొసరాజు వారి ఆత్మీయ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన 30 ఏళ్ల సర్వీసులో కేవలం 10 నుంచి 15 ఏళ్లు మాత్రమే సక్రమమైన పోస్టుల్లో పని చేసినట్లు ఏబీవీ చెప్పారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చి కమ్మ వ్యతిరేక పాలసీని తెచ్చి దాన్ని స్టేట్ పాలసీగా మార్చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ నాటిన విత్తనం 2019 నాటికి విష వృక్షంగా మారిందంటూ ఘాటుగా స్పందించారు. అప్పటి నుంచి కమ్మ అధికారులను టార్గెట్ చేసి అణచివేతకు గురి చేశారంటూ ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. కమ్మవారిపై యుద్ధమే ప్రకటించినట్లు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించారని చెప్పుకొచ్చారు.2019లో అధికారంలోకి వచ్చిన మర్నాడే వైఎస్ జగన్ తనకు ఉద్యోగం లేకుండా చేశారని ఏబీవీ చెప్పారు. పోస్టింగ్, జీతం అడిగితే సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కెరీర్‌పై ఊహించని మచ్చ వేయాలని చూశారని, కానీ చట్టం, న్యాయం రెండు తనను నిప్పుగా నిలపెట్టాయని చెప్పుకొచ్చారు. కరోనా వ్యాక్సిన్, ఎలక్షన్ కమిషనర్‌కు కులం రంగు పూసి విచక్షణా రహితంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. 2004 నుంచి రాజకీయాలు కమ్మవారిని కాపాడలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్మవారి పట్ల సానుభూతి, అభిమానం ఉన్నా.. కాపాడేందుకు రాజకీయ పార్టీలు ముందుకు రావని చెప్పుకొచ్చారు. వరదలు వచ్చినా, వైపరీత్యాలు వచ్చినా 75 శాతం విరాళాలు కమ్మవారివేనని ఏబీవీ తెలిపారు. సామాజికవర్గంతోపాటు సమాజానికి సైతం అందరూ తోడ్పడాలని ఏబీ వెంకటేశ్వరరావు హితవుపలికారు.