ఇంట్లో వాషింగ్ మెషిన్ మరమ్మతులకు గురైనా, ఫ్రిజ్ పనిచేయకపోయినా, విద్యుత్ సమస్యలు తలెత్తినా.. ఇంకా ఏ ఇతర సమస్య వచ్చినా మెకానిక్ కోసం వెతుకుతాం. లేదంటే ఆ పరికరాన్ని షాపునకు తీసుకువెళ్తాం. ఇకపై ఇలాంటి సమస్యలు తలెత్తితే సులువుగా పరిష్కరించుకోవచ్చు. మనం బయటకు వెళ్లనవసరం లేదు. ఒక్క ఫోన్ కాల్‌తో సుశిక్షితులైన మెకానిక్‌లు మన దగ్గరకే వస్తారు. వారే సర్వీస్ ప్రొవైడర్స్. నూతన వ్యవస్థను తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం హోం ట్రయాంగిల్ యాప్ రూపకల్పన చేయనుంది. ప్రజలకు సేవలందించేందుకు విజయనగరం కార్పొరేషన్, రాజాం, బొబ్బిలి మున్సిపాలిటీలు, నెల్లిమర్ల నగరపంచాయతీల్లో ముందుగా ఈ విధానాన్ని ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం అవుతోంది. ఇందుకు సంబంధించి రాజాం మున్సిపాలిటీలో ఈనెల 10న రిజిస్ట్రేషన్ ప్రక్రియకు మున్సిపల్ కమిషనర్ శ్రీకారం చుట్టారు. రాజాం మున్సిపాలిటీలో 100 మంది సర్సీస్ ప్రొవైడర్లను ఎంపిక చేయాలని నిర్ణయించారు. జిల్లాలో సుమారు 700 మందిని ఎంపికచేసి వారికి వృత్తినైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు.