అనంతపురం జిల్లా పరిపాలనకు సంబంధించిన సమీక్షలో ఓ ఉన్నతాధికారి తన ఫోన్ లో రమ్మీ ఆడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓవైపు రివ్యూ మీటింగ్ జరుగుతుండగా అదే మీటింగ్ కు హాజరైన డీఆర్ వో ఇలా ఫోన్ లో రమ్మీ ఆడుతుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి పనులపై చర్చ జరుగుతుంటే తనకేమీ పట్టనట్టు తీరిగ్గా ఆడుకుంటున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.అనంతపురం జిల్లాలోని కలెక్టరేట్ లో మీటింగ్ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ వో) మలోల చేసిన నిర్వాకమిది. మీటింగ్ ను వీడియో తీస్తున్న వ్యక్తి మలోల నిర్వాకాన్ని తన కెమెరాలో బంధించాడు. ఆపై వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.కీలక సమావేశంలో డీఆర్ వో మలోల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సీరియస్ అయ్యారు. మలోలపై మండిపడుతూ విచారణకు ఆదేశించారు. విచారణ తర్వాత నివేదిక ఆధారంగా డీఆర్ వో మలోలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాలతో మలోల నిర్వాకంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.