గతేడాది వన్డేలు, టెస్టుల్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో ఐసీసీ జట్లను ప్రకటించింది. అయితే టెస్టు జట్టుతో పోలిస్తే.. వన్డే జట్టులో భారీ మార్పులు కనిపించాయి. ముఖ్యంగా వన్డే జట్టులో ఒక్క భారత ప్లేయర్‌కు చోటు కల్పించలేదు. వన్డే టీమ్‌లో ఎంపిక చేసిన 11 మంది ఆటగాళ్లలో సారథిగా శ్రీలంక ఆటగాడు చరిత్ అసలంకను ఐసీసీ ఎంపిక చేసింది. ఈ జట్టులో ఉపఖండానికి చెందిన వారే 10 మంది ప్లేయర్లు ఉండటం గమనార్హం. ఐసీసీ ఎంపిక చేసిన వన్డే జట్టులో అత్యధికంగా శ్రీలంక నుంచి నలుగురికి చోటు దక్కింది. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ నుంచి ముగ్గురేసి చొప్పున ఆటగాళ్లు ఉన్నారు. వెస్టిండీస్ జట్టు నుంచి ఒక ప్లేయర్ ఉన్నాడు.
ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్:
సైమ్ అయూబ్ (పాకిస్థాన్), రహ్మానుల్లా గుర్బాజ్ (అఫ్గానిస్థాన్), పాతున్ నిస్సాంక (శ్రీలంక), కుశాల్ మెండిస్ (శ్రీలంక), చరిత్ అసలంక (కెప్టెన్- శ్రీలంక), రూథర్‌ఫోర్డ్ (వెస్టిండీస్), అజ్మతుల్లా ఒమర్జాయ్ (అఫ్గానిస్థాన్), వానిందు హసరంగ (శ్రీలంక), షహీన్ షా అఫ్రిది (పాకిస్థాన్), హారిస్ రవూఫ్ (పాకిస్థాన్), ఏఎం ఘజాన్‌ఫర్ (అఫ్గానిస్థాన్).
వన్డే జట్టులో ఒక్క భారత ఆటగాడికి కూడా చోటు దక్కపోవడానికి ఓ కారణం ఉంది. భారత్ గతేడాది కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడింది. అందులో ఒక్కదాంట్లోనూ గెలవలేదు. భారత్ సహా ఇతర జట్లతో పోలిస్తే శ్రీలంక, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ ఎక్కువగా వన్డే మ్యాచ్‌లు ఆడాయి. అందుకే ఆ దేశాలకు చెందిన ఎక్కువ మంది ప్లేయర్లకు అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.
ఇక టెస్టు జట్టులో మాత్రం ముగ్గురు భారత ప్లేయర్లకు చోటు దక్కింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్, పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు రవీంద్ర జడేజాకు కూడా ఈ టీమ్‌లో చోటు దక్కింది.
ఐసీసీ టెస్టు జట్టు:
యశస్వి జైశ్వాల్, బెన్ డకెట్ (ఇంగ్లాండ్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), జో రూట్ (ఇంగ్లాండ్), హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్), కామిండు మెండిస్ (శ్రీలంక), జేమీ స్మిత్ (ఇంగ్లాండ్), రవీంద్ర జడేజా, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్-ఆస్ట్రేలియా), మ్యాట్ హెన్రీ (న్యూజిలాండ్), జస్‌ప్రీత్ బుమ్రా.