చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో దాదాపు అన్ని వర్గాల వారి కోసం స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ చిన్న పిల్లలు, ఆడపిల్లలు, మహిళలు, ఉద్యోగులు, సీనియర్ సిటిజెన్ల కోసం పథకాలు ఉన్నాయి. ఎవరి స్థోమత, స్థాయికి తగ్గట్లుగా పెట్టుబడులు పెట్టొచ్చు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంటుంది అందుకే గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయి. నిర్దిష్ట వడ్డీ రేట్లను బట్టి నిర్ణీత కాల వ్యవధికి రిటర్న్స్ అందుకోవచ్చు. ఇక్కడ అన్ని పథకాల్లోనూ కచ్చితమైన రిటర్న్స్ పొందొచ్చు. అయితే.. కొన్ని పథకాలు మెచ్యూరిటీలో రాబడి అందిస్తే.. ఇంకొన్ని స్కీమ్స్ నెలవారీగా, 3 నెలలకు ఓసారి కూడా రిటర్న్స్ ఇచ్చేవి ఉంటాయి. ఇప్పుడు ప్రతి నెలా చేతికి డబ్బులు రావాలంటే.. ఒక పోస్టాఫీస్ స్కీమ్ ఉంది. దీని గురించి చూద్దాం.
ఇదే పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్. ఇక్కడ ప్రస్తుతం వార్షిక ప్రాతిపదికన 7.40 శాతం వడ్డీ రేటు ఉంది. కనీసం రూ. 1000 తో ఇందులో చేరొచ్చు. గరిష్టంగా సింగిల్ అకౌంట్లో అయితే రూ. 9 లక్షలు, జాయింట్ అకౌంట్లో అయితే రూ. 15 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. ఇది ఒకేసారి ఇన్వెస్ట్ చేసే స్కీమ్. ఒక్కసారి పెట్టుబడితో నిర్దిష్ట వడ్డీ రేట్ల ప్రకారం ప్రతి నెలా చేతికి డబ్బులు వస్తాయని చెప్పొచ్చు. స్కీమ్ కాలవ్యవధి 5 సంవత్సరాలు. అంటే ఇలా ఐదేళ్ల పాటు ప్రతి నెలా వడ్డీ అందుకోవచ్చు. మెచ్యూరిటీ సమయంలో మీ పెట్టుబడి మళ్లీ మీకొస్తుంది.
పథకం వివరాల్ని చూస్తే.. ఇండివిడ్యువల్‌గా ఒక్కరు అకౌంట్ తెరవొచ్చు. జాయింట్‌గా అయితే గరిష్టంగా ముగ్గురు వరకు ఉండొచ్చు. మైనర్ పేరిట గార్డియెన్ లేదా తల్లిదండ్రులు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. పదేళ్లు పైబడిన వారు సొంతంగా తెరుచుకునే ఛాన్స్ ఉంది. జాయింట్ అకౌంట్లో ఒక్కొక్కరు సమాన మొత్తం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రతి నెలా వడ్డీ నేరుగా సేవింగ్స్ అకౌంట్లోనే పడిపోతుంది. ముందస్తు ఉపసంహరణ చేస్తే నిబంధనల ప్రకారం.. వడ్డీపై కొంత శాతం మినహాయించి మిగతా మొత్తం ఇస్తారు. గుర్తింపు పొందిన బ్యాంకులు లేదా పోస్టాఫీసులకు వెళ్లి ఈ స్కీం కోసం అప్లై చేసుకోవచ్చు.
ప్రస్తుతం 7.40 శాతం వడ్డీ రేటు ఉండగా.. ఒక్కసారి రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే.. ఐదేళ్ల పాటు ప్రతి నెలా రూ. 3083 పొందొచ్చు. అదే సింగిల్ అకౌంట్ కింద గరిష్ట పెట్టుబడి అయిన రూ. 9 లక్షలు జమ చేస్తే అప్పుడు ప్రతి నెలా రూ. 5550 వస్తుంది. జాయింట్ అకౌంట్ గరిష్ట పెట్టుబడి లిమిట్ అయిన రూ. 15 లక్షలు డిపాజిట్ చేసినప్పుడు ప్రతి నెలా ఏకంగా రూ. 9250 ఆదాయం వస్తుంది. ఇక్కడ మీరు రూ. లక్ష, రూ. 2 లక్షలు, 4 లక్షలు ఇలా ఇన్వెస్ట్ చేయొచ్చు.