గూగుల్ క్రోమ్ సెర్చ్ ఇంజిన్ బ్రౌజర్ ను ఉపయోగించే విండోస్, మాక్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం అధీనంలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) హెచ్చరిక జారీ చేసింది. గూగల్ క్రోమ్ లో రెండు తీవ్రస్థాయిలో లోపాలు ఉన్నాయని, ఇవి హ్యాకర్లకు అవకాశాలుగా మారతాయని సీఈఆర్టీ స్పష్టం చేసింది. పీసీలు, ల్యాప్ టాప్ ల్లో విండోస్ ఓఎస్ వాడేవారికి, మాక్ యూజర్లకు ఈ హెచ్చరిక వర్తిస్తుందని తెలిపింది. స్మార్ట్ ఫోన్ యూజర్లకు దీనివల్ల ఏమంత నష్టం ఉండకపోవచ్చని సీఈఆర్టీ పేర్కొంది. గూగుల్ క్రోమ్ లోని ఈ లోపాల కారణంగా ఆయా డివైస్ లు హ్యాకర్ల అధీనంలోకి వెళ్లిపోతాయని, వాటిలోని సమాచారం హ్యాకర్ల పరమవుతుందని వివరించింది. ఈ నష్టాన్ని నివారించాలంటే వెంటనే విండోస్, మాక్ యూజర్లు తమ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ను లేటెస్ట్ వెర్షన్ కు అప్ డేట్ చేసుకోవాలని సీఈఆర్టీ స్పష్టం చేసింది. క్రోమ్ కు సెక్యూరిటీ ప్యాచ్ లు వస్తే, అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. విండోస్, మాక్ యూజర్లు తమ డివైస్ లలో 132.0.6834.83/8r, 132.0.6834.110/111కు ముందు వెర్షన్ల గూగుల్ క్రోమ్ ను వాడుతున్నట్టయితే వెంటనే అప్ డేట్ చేసుకోవాలని సీఈఆర్టీ తెలిపింది.ఇక, ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లినక్స్ యూజర్లు... 132.0.6834.110 వెర్షన్ కు ముందు గూగుల్ క్రోమ్ ను వాడుతున్నట్టయితే వారు కూడా లేటెస్ట్ వెర్షన్ కు అప్ డేట్ చేసుకోవాలని వెల్లడించింది.