ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సాక్షి పత్రికపై పరువు నష్టం కేసులో ఇవాళ విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరయ్యారు. వ్యక్తిగత కారణాలతో సాక్షి తరపు న్యాయవాది కోర్టుకు హాజరుకాకపోవడంతో విచారణ ఫిబ్రవరి 28కి వాయిదా పడింది. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నేను స్టాన్ ఫోర్డ్ యూనవర్సిటీలో ఎంబీయే చేశాను. స్టాన్ ఫోర్ట్ ఎంబీయే ఎందుకు? అనే ప్రశ్న ఉంటుంది. ప్రైవేటు రంగం నుంచి ఏదో ఒక సమయంలో రాజకీయాల్లోకి వస్తాను, అందుకే స్టాన్ ఫోర్డ్ ఎంబీయే ఎంచుకున్నాను. ఆ తర్వాత నాకు అర్థం అయింది ఏంటంటే... స్టాన్ ఫోర్డ్ ఎంబీయే బిజినెస్ కు మంచిదన్న విషయాన్ని గుర్తించాను. ఇక, పాదయాత్ర అనేది రాజకీయం కోసం. పాదయాత్రను రాజకీయాల్లో ఎంబీఏ వంటిదని చెప్పుకోవచ్చు. పాదయాత్రలో ప్రజలకు దగ్గరంగా ఉంటాం. నేను ఆ విధంగానే యువగళం పాదయాత్ర చేసి ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకున్నాను. ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నాం. యువగళం పాదయాత్రలో ఇచ్చిన ఒక్కో హామీని నిలబెట్టుకుంటున్నాం. ఇచ్చిన ప్రతిహామీ నిలబెట్టుకుంటాం. యువగళం పాదయాత్ర తర్వాత నిరంతరం ప్రజల్లో ఉండాలనేది నా కోరిక. అందుకే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నా. వారి సమస్యలు పరిష్కరిస్తున్నాం. తల్లి, చెల్లిపైనే జగన్ రెడ్డికి నమ్మకం లేదు. ఇక పార్టీలో ఉన్న నాయకులకు ఏం నమ్మకం ఉంటుంది? డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తారు. అది నిజం అవుతోంది. వైసీపీలో ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన నేతలు, అధికారులను వదిలిపెట్టేదిలేదు. దర్యాప్తు జరుగుతోంది. జరగనివ్వండి, త్వరలోనే అన్ని బయటకు వస్తాయని భావిస్తున్నా. కాకినాడ పోర్టును అడ్డగోలుగా, తుపాకీ పెట్టి లాక్కున్నారు. రూపాయిని ఆరు పైసలు పెట్టి విజయసాయిరెడ్డి కొట్టేశారు. కేసు పెట్టడం జరిగింది. ఈడీ కూడా విచారిస్తోంది. విశాఖలో భూకబ్జాలపైనా చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వ అక్రమాలపై ఒకేసారి దర్యాప్తు చేస్తే లా అండ్ ఆర్డర్ కు ఇక పోలీసులు ఉండరు. గాలి కూడా అమ్మేశారు. విచారణ పకడ్బందీగా చేయాల్సి ఉంది. ఒక్కొక్కటిగా చేస్తున్నాం. ఇది కక్షసాధింపు కాదు... అని లోకేశ్ స్పష్టం చేశారు.