ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏ ప్రూఫ్ లేకుండానే రూ. 75 వేల పన్ను ఆదా

business |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2025, 11:06 PM

పన్ను చెల్లింపుదారులు.. టాక్స్ తగ్గించుకునేందుకు మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు. మన దేశంలో ఆదాయంపై పరిమితి ఉంటుంది. నిర్దిష్ట ఆదాయం దాటితే టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం- 1961 లోని పన్ను శ్లాబుల్ని బట్టి టాక్స్ రేట్లు ఉంటాయి. అయితే.. కొన్ని మార్గాల ద్వారా పన్ను తగ్గించుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. సాధారణంగా పాత పన్ను విధానంలో రూ. 5 లక్షల వరకు ఆదాయంపై రిబేట్ వర్తిస్తుంది. అంటే అంత ఆదాయంపై పన్ను కట్టక్కర్లేదు. ఇంకా.. స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేలుగా ఉంది. ఈ స్టాండర్డ్ డిడక్షన్ అంటే.. పన్ను పడే ఆదాయం తగ్గించుకునేందుకు ఉద్దేశించింది. ఇలా పన్ను వర్తించే ఆదాయం నుంచి ఈ మొత్తాన్ని తీసేసి ఎంత పన్ను పడుతుందో లెక్కలు గట్టాలన్నమాట. ఇక కొత్త పన్ను విధానంలో రిబేట్ రూ. 7 లక్షల వరకు ఉండగా.. ఇక్కడ స్టాండర్డ్ డిడక్షన్ గత బడ్జెట్‌లో రూ. 50 వేల నుంచి రూ. 75 వేలకు పెరిగింది.


స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఎలాంటి డాక్యుమెంటేషన్ చూయించకున్నా అంటే ఎలాంటి ప్రూఫ్స్ లేకపోయినా పన్ను తగ్గించుకోవచ్చు. ఇది పన్ను వర్తించే ఆదాయం నుంచి తీసేయాలన్నమాట. తీసేయగా ఉన్న మొత్తంపై పన్ను వర్తిస్తుంది. వేతన జీవులకు ఊరట కలిగించేందుకు.. 1974లో తొలిసారి సెక్షన్ 16 కింద ఈ స్టాండర్డ్ డిడక్షన్‌ను (ప్రామాణిక తగ్గింపు) అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ తర్వాత పలుమార్లు స్టాండర్డ్ డిడక్షన్ మారుతూ వచ్చింది.


ఇక 2005-06 ఆర్థిక సంవత్సరంలో అప్పటి ఆర్థిక మంత్రి పి. చిదంబరం నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్‌ను తొలగించింది. ఆ సమయంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ. 30 వేలు లేదా జీతంలో 40 శాతం ఏది తక్కువైతే అది వర్తించేది. ఇది రూ. 5 లక్షలలోపు ఆదాయంపై మాత్రమే. ఆపైన ఆదాయం ఉంటే స్టాండర్డ్ డిడక్షన్ రూ. 20 వేలుగా ఉండేది. ఆదాయపు పన్ను శ్లాబుల విస్తరణ, మినహాయింపుల కారణంగా స్టాండర్డ్ డిడక్షన్ అవసరం లేదని అప్పటి ప్రభుత్వం అభిప్రాయపడి దీనిని తొలగించింది.


ఇక 13 సంవత్సరాల గ్యాప్ తర్వాత 2018 బడ్జెట్ సమయంలో స్టాండర్డ్ డిడక్షన్‌ను మళ్లీ తీసుకొచ్చింది. అప్పుడు రూ. 40 వేలుగా చేసింది. 2019 బడ్జెట్ సమయంలో దీనిని రూ. 50 వేలకు పెంచింది. ఇక కొత్త పన్ను విధానంలో తొలుత స్టాండర్డ్ డిడక్షన్ లేకున్నా.. తర్వాత 2023 బడ్జెట్ సమయంలో దీనిని కొత్త పన్ను విధానానికి కూడా వర్తింపజేసింది. గతేడాది బడ్జెట్‌లో కొత్త పన్ను విధానంలో దీనిని రూ. 75 వేలకు పెంచేసింది. శాలరీ ఎంత అనేది సంబంధం లేకుండా.. వేతన జీవులు అంతా స్టాండర్డ్ డిడక్షన్‌కు అర్హులే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com