ఆమె ఒక ఇంటర్ ఫస్టియర్ చదివే విద్యార్థిని. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చేయి, గొంతు కోసుకుని ప్రాణాలు తీసుకుంది. అయితే ఆ యువతి కుటుంబ సభ్యులు వచ్చి చూసే సరికి.. రక్తపు మడుగులో పడి ప్రాణాలు వదిలిన దృశ్యం కనిపించడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో వారు వచ్చి విచారణ ప్రారంభించారు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ యువతి సెల్‌ఫోన్ తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ చనిపోవడానికి ముందు ఆ యువతి సెల్ఫోన్లో ఏం సెర్చ్ చేసిందో చూసి.. పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే ఆ యువతి తన ప్రాణాలు తీసుకుందని పోలీసులు గుర్తించారు. ఆ యువతి సెల్‌ఫోన్ లాక్ తీసి.. ఆమె చివరిగా గూగుల్‌లో ఏం సెర్చ్ చేసిందో చూసి.. పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ యువతి ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అందులో చూశారు. మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుంది.. విదేశాల్లో ఎలాంటి సంస్కృతి ఉంటుంది అనే విషయాల గురించి ఆ యువతి ఎక్కువగా గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
అంతేకాకుండా ఈ కేసు విచారణలో భాగంగా నాగ్‌పూర్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడి అయ్యాయి. ఆమె గతంలో చేసిన పనులు, ఆమె ప్రవర్తన గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అయితే చనిపోవాలి అనే నిర్ణయం ఆ యువతి ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదని.. ఆత్మహత్య చేసుకునేందుకు ఆమె ఎంతో కాలంగా ప్లాన్లు వేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆ యువతి ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్ ఆడి.. వాటికి బానిస అయినట్లు అనుమానిస్తున్నారు.
ఈ క్రమంలోనే చనిపోవాలని నిర్ణయించుకుని.. ఆన్లైన్లో ఓ కత్తిని ఆర్డర్ చేసి తెప్పించుకుందని పోలీసులు తెలిపారు. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న కత్తి వచ్చిన తర్వాత.. మొదట ఆ యువతి.. తన చేతిపై గాట్లు పెట్టుకుందని.. ఆ తర్వాత తన మెడను కోసుకుని చనిపోయి ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన నాగ్‌పూర్ పోలీసులు.. పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు. ఇక తమ కన్నబిడ్డ ఇలా ఆత్మహత్య చేసుకుని చనిపోవడం చూసి.. ఆమె తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.