ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ యువతి హత్యాచార కేసు.. దోషికి ఉరిశిక్ష రద్దు

national |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 10:19 PM

 2014లో సంచలనం సృష్టించిన ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం యువతి దారుణ హత్య కేసులో తాజాగా సంచలన పరిణామం చోటు చేసుకుంది. ముంబైలో జరిగిన ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న వ్యక్తికి ఉరిశిక్ష పడగా.. తాజాగా ఆ శిక్షను రద్దు చేసి.. అతడిని నిర్దోషిగా సుప్రీంకోర్టు ప్రకటించింది. దీంతో 11 ఏళ్లుగా బాధితురాలి కుటుంబం చేస్తున్న పోరాటం ముగిసింది. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు సందర్భంగా ఆమె తండ్రి చేసిన వ్యాఖ్యలు కన్నీరు పెట్టిస్తున్నాయి. చనిపోయిన తన బిడ్డ ఎలాగో తిరిగిరాదని.. దేవుడికే ఈ విషయాన్ని వదిలేస్తున్నా అని బరువైన హృదయంతో స్పందించాడు. దీనిపై తాను ఇక ఏమీ చేయలేనని ఆ వృద్ధుడు చేతులెత్తేశాడు.


2014లో జరిగిన ఈ ఘటనలో ఆ టెకీని అత్యాచారం చేసి.. హత్య చేసిన మహారాష్ట్రకు చెందిన చంద్రభాన్ సుదామ్ సనప్ అనే వ్యక్తిని కింది కోర్టులు దోషిగా తేల్చి ఉరిశిక్ష విధించాయి. ఈ తీర్పును బాంబే హైకోర్టు కూడా గతంలోనే సమర్థించింది. దోషికి ఉరిశిక్ష విధించడం సరైందేనని పేర్కొంది. అయితే చంద్రభాన్ సుదామ్ సనప్.. తన ఉరిశిక్షను సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. ఏకంగా బిగ్ రిలీఫ్ దక్కింది. ఉరిశిక్ష కూడా రద్దు అయి.. అతడ్ని సుప్రీంకోర్టు నిర్దోషి అని తేల్చింది. ఈ సందర్భంగా బాధితురాలి తండ్రి తీర్పుపై స్పందించారు.


ఈ కేసులో దోషిగా ఉన్న సనప్‌ సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం తమకు తెలియదని.. కోర్టు నిర్దోషిగా తేల్చిన తర్వాత ఇక ఇప్పుడు తాము ఏం చేయాలని పేర్కొన్నాడు. తన వయసు ఇప్పుడు 70 ఏళ్లు అని.. తన భార్య అనారోగ్యంతో బాధపడుతోందని చెప్పాడు. ఈ ఘటన జరిగి ఇప్పటికే 11 ఏళ్లు గడిచిపోయాయని తెలిపాడు. తమ కుమార్తె చనిపోయినందుకు ఎంతో కొంత న్యాయం జరిగిందని ఇంతకాలం అనుకున్నామని.. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో అంతా మారిపోయిందని వాపోయాడు. ఆ ఘటన జరిగి తన కుమార్తె చనిపోయినపుడు ముంబైలో తాను అనుభవించిన వేదన మొత్తం ఇప్పుడు మళ్లీ తనకు కనిపిస్తోందని.. ఇక ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూకు వెళ్లాలని అనుకోవడం లేదని చెప్పాడు. ఇంకా ఈ కేసు కోసం తిరిగే శక్తి తనకు లేదని.. దీన్ని దేవుడికే వదిలేస్తున్నా అని వెల్లడించాడు.


మచిలీపట్నంకు చెందిన ఓ టెకీ.. ముంబైలోని ఒక హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగం చేసేది. సెలవుల్లో ఇంటికి వచ్చిన ఆ యువతి.. తిరిగి 2014 జనవరి 5వ తేదీన తిరిగి ముంబైకి రైలులో వెళ్లింది. అయితే ఆమె హాస్టల్‌కు చేరుకోలేదు. ఆ యువతి తండ్రి ఫోన్ చేసినా.. కలవలేదు. దీంతో అతడు విజయవాడ రైల్వే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. జనవరి 5వ తేదీన ఉదయం 5 గంటలకు స్టేషన్ బయట బైక్‌పై ఉన్న సనప్.. హాస్టల్‌లో దింపేందుకు 300 అడిగాడు. దారిలో ఎవరూ లేని ప్రదేశానికి ఆ యువతిని తీసుకెళ్లి.. అత్యాచారం చేసి చంపేసినట్లు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె మృతదేహాన్ని కొంతవరకు కాల్చి.. రోడ్డు పక్కన పొదల్లో పడేసినట్లు గుర్తించారు. 10 రోజుల తర్వాత.. ఆ యువతి మృతదేహాన్ని వెలికి తీశారు.


దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన ముంపై పోలీసులు.. మార్చి 2వ తేదీన సనప్‌ను అరెస్ట్ చేశారు. ట్రయల్‌ కోర్టు అతనికి మరణశిక్ష విధించగా.. పైకోర్టులు కూడా అంగీకరించాయి. అయితే ఆ తీర్పును సుప్రీంకోర్టులో చంద్రభాన్‌ సవాల్ చేయగా కోర్టు శిక్షను కొట్టివేసింది. ఈ కేసులో సాక్ష్యాధారాల సేకరణపై తాము సంతృప్తికరంగా లేమని.. సనప్ తరఫు లాయర్ అడిగిన ప్రశ్నలకు ప్రాసిక్యూషన్‌ సమాధానం ఇవ్వలేకపోయిందని పేర్కొన్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ చెప్పిన విషయాల్లో చాలా లోపాలున్నాయని.. సాక్షులు అబద్ధం ఆడవచ్చు గానీ.. సంఘటన జరిగిన చుట్టుపక్కల పరిస్థితులు కాదని కోర్టు తెలిపింది. ఈ కేసులో సాక్ష్యాధారాలను బట్టి సనప్‌పై నేరారోపణలు నిలబడటం సాధ్యం కాదని పేర్కొంటూ అతడిని నిర్దోషిగా కోర్టు ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com