‘మన మిత్ర’ ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజాప్రభుత్వం అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ప్రజలు ధృవపత్రాలు, ఇతర సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా పౌర సేవలను వేగవంతంగా అందజేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్ కు కూటమి ప్రభుత్వం నాంది పలికింది. దేశంలో తొలిసారిగా ‘మన మిత్ర’ పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో ఈరోజు మంత్రి లోకేశ్ లాంఛనంగా ప్రారంభించారు. దీనికోసం అధికారిక వాట్సాప్ నెంబర్ 9552300009ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ... యువగళం పేరుతో 3,132 కి.మీల పాదయాత్ర చేశాను. ఈ ఆలోచన యువగళం పాదయాత్ర నుంచి మొదలైంది. నా ప్రసంగాలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక బటన్ నొక్కితే సినిమా చూస్తున్నాం, భోజనం వస్తోంది, క్యాబ్ వస్తుంది. ఒక బటన్ నొక్కితే ప్రభుత్వం ఎందుకు ప్రజల వద్దకు రాదనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఆ ఛాలెంజ్ ను నేను స్వీకరిస్తున్నాని ఆనాడు చెప్పా. అందుకే ‘మన మిత్ర’ ప్రజల చేతిలోని ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజాప్రభుత్వం నినాదంతో వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించడం జరుగుతోంది అని మంత్రి లోకేశ్ అన్నారు.