రాజకీయ కక్షతోనే కూటమి ప్రభుత్వం తమపైన కేసులు పెడుతున్నారని, చంద్రబాబు పెట్టే కేసులకు భయపడే ప్రసక్తే లేదని వైయస్ఆర్‌సీపీ లోక్‌సభాపక్షనేత ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు. కేసులు పెడితే మేము మరింత బలంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష నేతల సమావేశంలో మిథున్ రెడ్డి పాల్గొన్నారు. అఖిలపక్ష భేటీలో పోలవరం ఎత్తు తగ్గింపు, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, డ్రగ్స్ సమస్య, మార్గదర్శి కుంభకోణంపై చర్చకు అవకాశం ఇవ్వాలని మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు.‘ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్స్ పాలిటిక్స్ చేస్తున్నారు. పుంగనూరులో మేము కొనుగోలు చేసిన భూములను అటవీ భూములు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పెద్దిరెడ్డి పేరును ఆయన రోజూ తలుచుకుంటున్నారు. ఏదో ఒక రకంగా కక్ష సాధించాలని చూస్తున్నారు. 2001లోనే మేము భూములను కొనుగోలు చేశాం. 75 ఎకరాల భూమి విలువ మూడు కోట్లు మాత్రమే. ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోం. ఎలాంటి విచారణకైనా మేము సిద్ధం. రాజకీయ కక్షతోనే మాపైన కేసులు పెడుతున్నారు. మాపై ఇప్పటి వరకు చేసిన ఆరోపణలను రుజువు చేయలేకపోతే క్షమాపణలు చెప్పాలి. కూటమి కుట్రలను ఎదుర్కొనేందుకు సిద్ధం` అని మిథున్‌రెడ్డి చెప్పారు.