వాట్సాప్ గవర్నెన్స్ కు 36 శాఖలను అనుసంధానించాల్సి ఉంటుంది. ఇది చాలా క్లిష్టతరమైన పని. మొదటి విడతలో 161 పౌర సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. రెండో విడతలో 360 పౌర సేవలు ప్రారంభిస్తాం. ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సాప్ గవర్నెన్స్. రియల్ టైంలో ధృవపత్రాలు అందించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది. సర్టిఫికెట్లు అందజేసినప్పుడు వాటిపై ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్ సైట్ కు ఆ లింక్ వెళ్తుంది. దీంతో నకిలీ సర్టిఫికెట్లకు ఆస్కారం ఉండదు. బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా త్వరలోనే తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నెంబర్ సెలెక్షన్ ద్వారా రెవెన్యూ, మున్సిపల్, ఎండోమెంట్ సర్వీసులతో పాటు అనేక సర్వీసులు తీసుకువచ్చాం. రెండో దశలో ఏఐ బాట్, వాయిస్ ద్వారా కూడా అమలు చేస్తాం. ప్రపంచంలోనే వాట్సాప్ గవర్నెన్స్ అమలు చేస్తున్న తొలి రాష్ట్రం మనది. దీనికి మరింత మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉంది. ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. లోటుపాట్లు సరిచేసుకుని మరింత మెరుగ్గా దీనిని తీర్చిదిద్దుతాం. రియల్ టైం గవర్నెన్స్ లో కూడా అన్ని శాఖల నుంచి సమాచారాన్ని తీసుకుని క్రోడీకరిస్తున్నాం. డేటా లేక్ క్రియేట్ చేసి సీమ్ లెస్ సర్వీసెస్ అందిస్తాం. గత మూడు నెలలుగా మా టీం అహర్నిశలు కష్టపడ్డారు. గత 15 రోజులుగా టెస్టింగ్ చేస్తున్నాం. ఇంకా మెరుగులు దిద్దాలని నాకు అర్థమైంది. ఇదొక ప్రయాణం. ఆరు నెలల్లో ఐడియల్ ప్రొడక్ట్ గా తీర్చిదిద్దుతాం. అన్ని సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం. పాదయాత్ర హామీని నిలబెట్టుకున్నా. ఆరు నెలల్లో ఎంతమార్పు వస్తుందో ప్రజలే చూస్తారు అని మంత్రి లోకేశ్ చెప్పుకొచ్చారు.మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్, హెడ్ సంధ్య దేవనాథన్ మాట్లాడుతూ.. ఈ రోజు మీ మధ్య ఉండటం చాలా ఆనందంగా ఉంది. 'మన మిత్ర' వాట్సాప్ సేవలు ప్రారంభించడం జరుగుతోంది. ప్రతి ఒక్కరి జీవితంలో వాట్సాప్ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. 'మన మిత్ర' ద్వారా 161 పౌర సేవలను ప్రతి ఒక్కరికీ అందిస్తాం. ప్రజలు సులభంగా వినియోగించేలా వాట్సాప్ గవర్నెన్స్ ను రూపొందించాం. వాట్సాప్ గవర్నెన్స్ సేవల కోసం చాలా కృషిచేశామన్నారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి మన మిత్రను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.వాట్సాప్ డైరెక్టర్, ఇండియా హెడ్ రవి గార్గ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నాం. అయితే సింగిల్ ప్లాట్ ఫామ్ పై అన్ని రకాల సేవలు అందించడం ఎక్కడా లేదు. 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ ను మరింత అభివృద్ధి చేసి మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం. హాయ్ అని టైప్ చేయడం ద్వారా ప్రజలు సులభంగా పౌరసేవలను పొందవచ్చని అన్నారు. ప్రస్తుతం 161 రకాల సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేని, ఆర్టీజీఎస్ సీఈవో కె. దినేశ్ తదితరులు పాల్గొన్నారు.