ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌,., ప్రైవేటీకరణపై కీలక ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2025, 07:20 PM

ఇప్పటివరకు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేస్తారని ఊహాగానాలు రాగా.. అవేమీ లేదని కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. అయితే ఇటీవలె విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి భారీగా నిధులు కేటాయించిన కేంద్రం.. తాజాగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయమని.. పునర్నిర్మిస్తామని స్పష్టం చేసింది. దీంతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ఆధారపడిన వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి, ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ.. విశాఖ చేరుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రతినిధులు, అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఆ తర్వాత ఏపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, ఎంపీలు భరత్‌, కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులతో కలిసి కేంద్రమంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ సాధన కోసం సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. స్టీల్ ఫ్యాక్టరీ మొదట్లో ఉత్పత్తి బాగా ఉండేదని.. 2013-14 వరకు పనితీరు బాగానే ఉందని పేర్కొన్నారు. 2014లో నవరత్న హోదా సాధించిన తర్వాత.. ఉక్కు ఉత్పత్తి పెంచాలని నిర్ణయించినప్పటి నుంచి నష్టాల్లోకి వెళ్లిందని వెల్లడించారు.


విశాఖ స్టీల్ ప్లాంట్ దుస్థితి గురించి ఎంపీలు వివరించారని.. తాను కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై ఎన్నో సమీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. 2021లో విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రతిపాదనలు చేశారని వివరించారు. ప్రస్తుతం విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.35వేల కోట్ల అప్పు ఉందని వెల్లడించారు. 2030లోపు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో 300 మిలియన్‌ టన్నుల స్టీల్‌ ఉత్పత్తి సాధించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యాన్ని నిర్దేశించారని గుర్తు చేశారు. ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో ప్రస్తుతం భారత్ రెండో స్థానంలో ఉందని చెప్పారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలోని కార్మికుల సమస్యలను 3 నెలల్లో పరిష్కరిస్తామని కేంద్రమంత్రి కుమారస్వామి వివరించారు.


అంతకుముందు కేంద్రమంత్రులు కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాసవర్మలకు.. విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద మంత్రి సత్యకుమార్, ఎంపీ సీఎం రమేష్, బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి వస్తుండగా.. కేంద్రమంత్రుల కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. షీలానగర్‌ వద్ద కాన్వాయ్‌లోని మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ధ్వంసం అయ్యాయి. ప్రమాదం జరిగిన వాహనాల్లో మాజీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు కారు కూడా ఉంది. అనంతరం వారంతా స్టీల్‌ప్లాంట్‌లోని హిల్‌టాప్‌ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com