ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచంలోనే తొలిసారి,,,,ఒకే పిల్లర్‌పై ఒకేసారి 5 మెట్రో రైళ్ల పరుగులు

national |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 11:08 PM

దేశంలోని వివిధ నగరాల్లో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, కోల్‌కతా, పూణే, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. మరికొన్ని నగరాల్లో కొత్తగా మెట్రో రైల్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో నిర్మించిన మెట్రో రైల్ మార్గాల కంటే టెక్నాలజీలో, నిర్మాణంలో సరికొత్తగా.. కొత్త వాటి నిర్మాణం చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే ఏ దేశంలోనూ లేని విధంగా తొలిసారి భారత్‌లోనే.. ఒకే పిల్లర్‌పై ఒకే సమయంలో 5 మెట్రో రైళ్లు ప్రయాణించేలా.. తమిళనాడు రాజధాని చెన్నైలో మెట్రో మార్గాన్ని నిర్మిస్తున్నారు. చెన్నై మెట్రో ఫేజ్-2లో భాగంగా.. ప్రపంచ దేశాల్లో లేని విధంగా మొదటిసారి ఈ నిర్మాణం చేస్తున్నారు.


చెన్నై మెట్రో ఫేస్-2లో భాగంగా కొత్తగా 3 మెట్రో కారిడార్లను నిర్మిస్తున్నారు. దీంతో మొత్తంగా చెన్నై మెట్రోలో 5 కారిడార్లు కానున్నాయి. మలైమలార్ రిపోర్ట్ ప్రకారం.. చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్.. ఫేస్-2లో 5 మెట్రో రైళ్లను ఒకేసారి ప్రయాణించేలా కొత్త పిల్లర్ డిజైన్‌ను రూపొందించింది. ఇప్పటివరకు చెన్నై మెట్రోలో రెండు కారిడార్లు ఉన్నాయి. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి.. సెయింట్ థామస్ మౌంట్ వరకు ఒక కారిడార్.. విమ్‌కో నగర్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు మరో కారిడార్లలో మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్నాయి.


ఇప్పుడు చెన్నై మెట్రో ఫేస్-2లో మరో 3 కారిడార్లు నిర్మిస్తున్నారు. మూడో కారిడార్‌ను మాధవరం నుంచి సిప్‌కోట్(సిరుసేరి) వరకు.. నాలుగో కారిడార్ పూనమల్లే నుంచి లైట్ హౌస్ వరకు.. ఐదో కారిడార్‌ను.. మాధవరం నుంచి షోలింగనల్లూర్‌లను కలుపుతూ నిర్మించనున్నారు. చెన్నై మెట్రో ఫేజ్ 2 డిజైన్ ప్రకారం.. కారిడార్-4, కారిడార్-5లు 5 స్టేషన్లను పంచుకోనున్నాయి. ఆ ఐదు స్టేషన్లు అల్వర్తిరునగర్, వలసరవక్కం, కరంబక్కం, అలపాక్కం, పోరూర్ అని చెన్నై మెట్రో అధికారులు వెల్లడించారు.


అల్వర్తిరునగర్ నుంచి పోరూల్ మధ్య ఉన్న ఎలివేటెడ్ స్ట్రెచ్‌లో ఒక పిల్లర్ సపోర్ట్‌పై ఒకేసారి 4 రైళ్లు ప్రయాణించనున్నాయి. ఇందులో కారిడార్-4లోని రెండు రైళ్లు.. కారిడార్-5లోని మరో రెండు రైళ్లు రెండు వైపులా ప్రయాణించనున్నాయి. ఇందుకోసం ప్రయాణికులు ప్లాట్‌ఫామ్‌లపైకి వెళ్లేందుకు లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మెట్రో స్టేషన్లలో మొదటి అంతస్తులో కన్‌కోర్స్ ఏర్పాటు చేయనుండగా.. 2, 3 అంతస్తుల్లో కారిడార్-4, కారిడార్-5లు ఉంటాయి. ఇదే మూడో అంతస్తులో వలసరవవాక్కం-కరంబక్కం మెట్రో స్టేషన్ల మధ్య లూప్ లైన్ కోసం.. ఐదో లైన్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని.. చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ ఫేజ్-2 ప్రాజెక్ట్ డైరెక్టర్ అర్జునన్ పేర్కొన్నారు. ఆ ఐదో లైన్ మెట్రో రైళ్ల మెయింటెనెన్స్ పనుల కోసం.. మెట్రో రైళ్లు డిపోల నుంచి రావడం పోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com