ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఇవాళ (బుధవారం) మౌని అమావాస్య సందర్భంగా.. భారీగా భక్తులు మహా కుంభమేళాకు వస్తారు. అయితే ఇవాళ ఒక్కరోజే 8 కోట్ల నుంచి 10 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ సర్కార్ అంచనా వేసింది. అయితే ప్రభుత్వ అంచనాలను పటాపంచలు చేస్తూ 12 కోట్ల నుంచి 14 కోట్ల మంది భక్తులు కుంభమేళాకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కుంభమేళాలో జరుగుతున్న వేళ వచ్చే ఈ మౌని అమావాస్య ప్రత్యేకమైనదిగా హిందూ పురాణాలు చెబుతున్నాయి. మౌని అంటే సంస్కృతంలో మౌనంగా ఉండటం అని అర్థం. ఈ మౌని అమావాస్య రోజున ఎవరితోనూ మాట్లాడకుండా పూర్తిగా మౌనదీక్ష పాటించాలని పేర్కొంటున్నాయి. మహాశివరాత్రి పర్వదినానికి ముందు వచ్చే అమావాస్య కావడంతో సాధువులు, యోగసాధకులు ఈ మౌని అమావాస్యను అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు.
ఇక ఆధ్మాత్మిక పరంగా ఈ మౌని అమావాస్య రోజు గంగానదిలో ప్రత్యేకించి త్రివేణి సంగమంలోని జలాలు అమృతంతో సమానంగా ఉంటాయని భావిస్తారు. ఇలాంటి మౌని అమావాస్య సమయంలో అక్కడ పుణ్యస్నానం చేస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఈ మౌని అమవాస్య అత్యంత పవిత్రదినం కావడంతో ఈ రోజే కొత్తగా నాగ సాధువుల్లో చేరేవారికి దీక్షను ఇస్తారు. రావిచెట్టు నీడలో దీపాలు వెలిగించి పితృదేవతలకు తర్పణం కూడా పెడతారు.
అయితే ఈ మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్దకు బుధవారం అర్ధరాత్రి ఒంటి గంటకే అమృత స్నానాలను చేసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. రాత్రి ఒంటిగంట వరకే సంగం ఘాట్ భక్తులతో కిటకిటలాడింది. దీంతో సంగం ఘాట్ వద్ద భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో అక్కడ ఉన్న బారికేడ్లు విరిగిపోయాయి. ఏం జరుగుతుందో తెలియక ఒక్కసారే భక్తులు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగింది.