ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లీటర్‌ పులి మూత్రం రూ.2400.. దేనికి ఉపయోగిస్తున్నారంటే

international |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 11:15 PM

డబ్బు సంపాదించడంలో చైనా వాళ్ల తెలివే వేరుగా ఉంటుంది. చైనాలో తయారు చేసిన ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా పులి మూత్రాన్ని కూడా విక్రయించి.. చైనావాసులు డబ్బులు సంపాదిస్తున్నారు. చైనాలో ఉన్న ఓ జూ నిర్వాహకులు.. పులి మూత్రాన్ని సేకరించి.. దాన్ని విక్రయిస్తున్నారు. ఈ పులి మూత్రంలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయని పేర్కొంటూ.. భారీ ధరకు అమ్మేస్తున్నారు. పావు లీటర్ పులి మూత్రాన్ని రూ.600కు విక్రయిస్తూ.. కాసుల పంట పండించుకుంటున్నారు. అయితే వివిధ రకాల సమస్యలకు ఈ పులి మాత్రం ఔషదంగా పనిచేస్తుందని ఆ జూ నిర్వాహకులు చెబుతుండటం గమనార్హం. అయితే డాక్టర్లు, నెటిజన్లు మాత్రం దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


చైనా మీడియా వెల్లడించిన కథనం ప్రకారం.. సిచువాన్‌ ప్రావిన్స్‌లోని "ది యాన్‌ బైఫెంగ్సియా" అనే వైల్డ్ లైఫ్ జూ నిర్వాహకులు పులి మూత్రాన్ని విక్రయిస్తున్నారు. ఈ పులి మూత్రాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్సలో వాడితే ప్రయోజనం ఉంటుందని ఆ జూ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సైబీరియన్‌ పులుల నుంచి సేకరించిన మూత్రాన్ని పావు లీటర్‌ సీసాను రూ.600 చొప్పున విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. అంటే ఒక లీటర్ పులి మూత్రం రూ.2400 పలుకుతోంది. కీళ్లవాతం, ఎముకలు బెణకడం, కండరాల నొప్పులకు ఈ పులుల మూత్రం ఔషధంగా పని చేస్తుందని ప్రచారం కూడా చేస్తున్నారు. అదేంటని ప్రశ్నిస్తే.. ఇందుకు కావాల్సిన అనుమతులు కూడా తమ వద్ద ఉన్నాయంటూ.. దబాయిస్తున్న వైనం అక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పులి మూత్రం విక్రయాలకు సంబంధించి చైనా సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.


ఈ పులి మూత్రాన్ని మోకాళ్లపై పోసి.. బాగా మర్దన చేస్తే రూమటాయిడ్ ఆర్థరైటిస్ నొప్పులు మాయం అయిపోతాయని ది యాన్ బైఫెంగ్సియా జూ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ పులి మూత్రాన్ని నేరుగా కాళ్లపై పోయకుండా.. అందులో కలపాల్సిన వాటి గురించి కూడా వివరించారు. మొదట పులి మూత్రంలో కొంత వైట్ వైన్‌ను కలపాలని.. ఆ తర్వాత దాన్ని బాగా కలుపుకుని.. అందులో ఒక అల్లం ముక్క వేసి.. దాంతో నొప్పి ఉన్న ప్రాంతంలో మసాజ్ చేయాలని చెబుతున్నారు. నొప్పి నుంచి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలనుకుంటే.. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడేవారి నేరుగా పులి మూత్రాన్ని తాగొచ్చని కూడా సూచిస్తున్నారు. అయితే ఏదైనా అలర్జీ వస్తే మాత్రం పులి మూత్రాన్ని తాగడం వెంటనే మానేయాలని పేర్కొంటున్నారు.


పులి బోనులో ఏర్పాటు చేసిన బేసిన్‌లో నుంచి పులి మూత్రాన్ని సేకరించి.. దాన్ని బాటిళ్లలో నింపుతున్నట్లు ఆ జూ సిబ్బంది తెలిపారు. అయితే నేరుగా పులి మూత్రాన్ని బాటిళ్లలో నింపుతారా లేక.. దాన్ని ఏదైనా ఫిల్టర్ చేస్తారా అనేది మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం ఈ పులి మూత్రం అమ్మకాలు చాలా తక్కువగానే ఉన్నాయని.. రోజుకు 2 బాటిళ్లకు మించి ఎవరూ కొనుగోలు చేయట్లేదని చెబుతున్నారు. అయితే 2014లోనే ఈ జూ అధికారులు ఒక రియాలిటీ షోను నిర్వహించి.. అందులో విజేతలుగా నిలిచిన వారికి ఈ పులి మూత్రాన్ని బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది.


మరోవైపు.. పులి మూత్రంతో రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు చికిత్స చేస్తున్నారని వస్తున్న వార్తలను హుబెయ్ ప్రావిన్షియల్ ట్రడీషినల్ చైనీస్ మెడిసిన్ హాస్పిటల్ ఫార్మసిస్ట్ కొట్టిపారేశారు. పులి మూత్రంలో ఎలాంటి ఔషధ విలువ లేవని.. సాంప్రదాయ వైద్యంలోనూ పులి మూత్రంతో చికిత్స లేదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా పులి మూత్రాన్ని విక్రయించేందుకు సదరు జూకు లైసెన్స్ కూడా లేదని పేర్కొన్నారు. అయితే చాలా మంది ఈ పులి మూత్రంతో చికిత్స చేసుకున్న వారు.. తమకు ఎలాంటి ప్రభావం చూపలేదని సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. మరోవైపు.. మరికొందరు పులి మూత్రం నుంచి బ్యాక్టీరియా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది డబ్బుల కోసం చేస్తున్నారా లేక ఆరోగ్యానికి హాని కలిగించేందుకు చేస్తున్నారా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com