ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుంభమేళా తొక్కిసలాట .. ఎంత మంది చనిపోయారంటే

national |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 10:20 PM

మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ్‌నగర్‌ త్రివేణి సంగమం వద్ద మహా కుంభమేళాలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. ఈ దుర్ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు.. మరో 60 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. చనిపోయిన వారిలో 25 మందిని మాత్రమే ఇప్పటివరకు గుర్తించినట్లు పేర్కొన్నారు. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి 2 గంటల మధ్యలో ఈ తొక్కిసలాట ఘటన చోటు చేసున్నట్లు మహా కుంభ్ డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు.


మరో ఐదుగురు ఎవరు అనేది గుర్తించే పనిలో పడినట్లు మహా కుంభ్ డీఐజీ వైభవ్ కృష్ణ స్పష్టం చేశారు. మౌని అమావాస్య వేళ.. బుధవారం అర్ధరాత్రి ఒంటిగంటకు గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు చేసేందుకు లక్షలాది మంది భక్తులు ఒక్కసారిగా తరలిరావడంతో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే.


తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తం కంటే ముందే పుణ్య స్నానాలు చేయాలని.. భారీగా భక్తులు అఖారా మార్గ్ వద్ద గుమిగూడారని డీఐజీ వెల్లడించారు. భక్తులు ఒకరిని మరొకరు తోసుకోవడంతో బారికేడ్లు విరిగిపోయినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే బ్రహ్మ ముహూర్తం వేళ పుణ్యస్నానాలు చేయడానికి వేచి ఉన్న భక్తులపైకి.. ఈ భక్తుల గుంపు పరుగులు తీయడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు వివరించారు. అయితే.. సుమారు 90 మందిని అంబులెన్స్‌ల ద్వారా దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా.. దురదృష్టవశాత్తు అందులో 30 మంది భక్తులు మరణించినట్లు చెప్పారు.


ఇక చనిపోయిన 30 మందిలో 25 మందిని గుర్తించామని.. మిగిలిన వారిని గుర్తించాల్సి ఉందని డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. వీరిలో కర్ణాటకకు చెందిన నలుగురు.. అస్సాం, గుజరాత్‌ రాష్ట్రాలకు చెందిన ఒక్కో భక్తుడు ఉన్నట్లు వెల్లడించారు. స్థానికంగా ఉన్న మెడికల్ కాలేజీలో 36 మంది గాయపడినవారు చికిత్స పొందుతున్నారని చెప్పారు. ప్రస్తుతం తొక్కిసలాట ఘటన వద్ద పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. భక్తుల సౌకర్యం కోసం.. మహామండలేశ్వరులు, సాధువులు, అఖారాలకు చెందిన వారు కొంత ఆలస్యంగా పుణ్యస్నానాలు ఆచరించాలని ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోరినట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com