కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువైందని, అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు ఆక్షేపించారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో దళిత రైతు రమణయ్యను టీడీపీ నాయకుడు దాడి చేసి కొట్టడంతో, ఆయన ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు.
దళితులపై దాడులు జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న హోం మంత్రి వంగలపూడి అనిత తక్షణం రాజీనామా చేయాలని కనకారావు డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయింది. నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక మూల హత్యలు, అత్యాచారాలు, దాడులతో దళితులను వేధింపులకు గురి చేస్తున్నారు. దళితులను గ్రామ బహిష్కరణలు, సామాజిక బహిష్కరణలు చేస్తున్నారు. గత జగన్ పాలనలో దళితులు ఆత్మగౌరవంతో తలెత్తుకు జీవిస్తే.. కూటమి ప్రభుత్వ పాలనలో దళితులు రక్షణ కోసం దిక్కులు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పడేసి లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో జరిగిన రెండు వేర్వేరు ఘటనలే దీనికి ఉదాహరణ. చిత్తూరు జిల్లా సదుం మండలం నడిగడ్డ మాదిగపల్లెలో రమణయ్య (62) అనే దళిత రైతుపై అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు పవన్‌కుమార్‌రెడ్డి దాడి చేయడంతో మృతి చెందాడు.
మరో ఘటనలో శ్రీరంగరాజపురం మండలంలో పాతపాళ్యం దళితవాడకు చెందిన వెంకటేశ్ అనే దళిత రైతు 30 ఏళ్లుగా తన వ్యవసాయ భూమిలో మామిడి, కొబ్బరి పంటలు సాగు చేస్తున్నాడు. ఆ భూమిలోకి ప్రవేశించిన రెవెన్యూ అధికారులు పంటలను నేలమట్టం చేయడంతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. ఇవే కాకుండా నాలుగు నెలల క్రితం కర్నూలు జిల్లా ఆదోనిలో ట్రాక్టర్‌తో తొక్కించి గోవిందమ్మ అనే మహిళను చంపేశారు. అదే జిల్లాలో దళితులను గ్రామ బహిష్కరణ చేశారు. జనసేన పార్టీకి చెందిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్వయంగా దళిత ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావును అసభ్యంగా దూషించడమే కాకుండా దాడి చేసి కొట్టాడు. చంద్రబాబుకు దళితులు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుంది.
చంద్రబాబు పాలనలో దళితులపై జరుగుతున్న అరాచకాలపై దళిత సంఘాలు ఇప్పటికైనా ముందుకొచ్చి ప్రశ్నించాలి. దళితులకు జరుగుతున్న అన్యాయాలపై హోంమంత్రి స్థానంలో ఉన్న దళిత మహిళ వంగలపూడి అనిత నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం దారుణం. ఆమె తక్షణం తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి. తక్షణమే చిత్తూరు వెళ్లి రమణయ్య కుటుంబాన్ని పరామర్శించాలి. వెంకటేశ్ కుటుంబానికి ప్రభుత్వం పరంగా న్యాయం జరిగేలా చూడాలి. అలాగే, రమణయ్యను హత్య చేసిన నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేసి చట్టప్రకారం శిక్షించాలని కొమ్మూరి కనకరావు కోరారు.