ఉత్తర్ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఇప్పటికే ఒకసారి అగ్ని ప్రమాదం జరగ్గా.. మౌని అమావాస్య సందర్భంగా బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి అక్కడ ప్రమాదం జరిగింది. గురువారం మహా కుంభమేళాలలో మళ్లీ ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ప్రయాగ్రాజ్ సెక్టార్-22లోని ఛట్నాగ్ ఘాట్ వద్ద ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు స్థానికులు వెల్లడించారు. ఈ అగ్ని ప్రమాద ఘటనలో అక్కడ ఏర్పాటు చేసిన దాదాపు 15 గుడారాలు కాలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గతంలోనూ కుంభమేళాలో అగ్ని ప్రమాదం జరిగింది. 11 రోజుల క్రితం మహా కుంభమేళాలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఒక్కసారిగా భారీగా మంటలు వ్యాపించాయి. ఆ ఘటనలో 18 టెంట్లు దగ్ధం అయ్యాయి.