బిల్ గేట్స్.. తన జీవితానికి సంబంధించిన కథను పుస్తకంగా మలిచారు. "సోర్సో కోడ్" పేరుతో రాబోతున్న ఈ పుస్తకంలో తనకు సంబంధించిన అనేక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా "సోర్స్ కోడ్"ను మొత్తంగా మూడు పుస్తకాలుగా తీసుకు వస్తుండగా.. మొదటిది "సోర్స్ కోడ్ - మై బిగినింగ్" పేరుతో రాబోతుంది. ఇందులో బిల్ గేట్స్ బాల్యం ఉండబోతున్నట్లు సమాచారం. అయితే చిన్నప్పడు ఆటిజం సమస్యతో బాధ పడిన బిల్ గేట్స్ దాన్నుంచి ఎలా బయట పడ్డాడు, తనను బాగు చేయించడానికి తల్లిదండ్రులు ఎంతగా కష్ట పడ్డారో కూడా ఆయన అందులో వివరించారట.
ముఖ్యంగా స్కూలింగ్ సమయంలో బిల్ గేట్స్ చేసిన చిలిపి పనులు, ఆయన ఆహారపు అలవాట్లను కూడా తెలిపారు. ముఖ్యంగా టీనేజ్‌లో ఉండగా.. తాను అమ్మాయిలను ప్రేమలో పడేయడానికి డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు ఈ పుస్తకంలోనే తెలిపారని.. పీపుల్స్ మేగజైన్ వెల్లడించింది. నిషేధిత ఎల్ఎస్డీ డ్రగ్‌ను పలుమార్లు రుచి చూసినట్లు కూడా బిల్ గేట్స్ వివరించారు. గంజాయి కూడా వాడినట్లు చెప్పుకొచ్చాడు. కానీ వీటి వల్ల ఏ ఒక్క అమ్మాయి కూడా తనకు దగ్గర కాలేదని.. స్పష్టం చేశారు.
అలాగే తాను మొదటి సారి మద్యం తాగిన క్షణాల గురించి సోర్సో కోడ్ పుస్తకంలో చెప్పుకొచ్చారు. తన స్నేహితుడు పాల్ తాగమని బలవంతం చేయడంతో తొలిసారి విస్కీ తాగానని.. కానీ అది ఎక్కువై అనారోగ్యానికి గురైనట్లు కూడా వెల్లడించారు. ఇక అప్పటి నుంచి తనకు విస్కీ అంటే నచ్చదని.. ఇప్పటికీ దాని వాసన కూడా చూడలేకపోతున్నానని పేర్కొన్నాడు. ఇవి మాత్రమే కాకుండా చిన్ననాటి స్నేహితుడు ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం. తనను ఎంతగానో కలిసి వేసిందని అందులో వివరించారు. తన యవ్వనం వరకు మాత్రమే రాసిన ఈ పుస్తకం ఫిబ్రవరి 4వ తేదీన విడుదల కాబోతుండగా.. మున్ముందు రాబోతున్న పుస్తకాల్లో మిగతా విషయాలు చెప్పబోతున్నారు. అందులో ఉద్యోగ జీవితం, మైక్రోసాఫ్ట్ లో ప్రయాణం, మెలిందా గేట్స్ తో వివాహం, దాతృత్వ కార్యక్రమాలు ఉండబోతున్నాయి.