ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అ నీళ్లు ఈసీ అధికారులు తాగితే నా తప్పు ఒప్పుకుంటా: కేజ్రీవాల్

national |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2025, 08:31 PM

హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ.. కావాలనే యమునా నదిలో పారిశ్రామిక విష పదార్థాలను కలుపుతుందంటూ ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మంగళవారం రోజు కామెంట్లు చేశారు. దీంతో గొడవ ప్రారంభం అయింది. దేశంలోని అనేక మంది బీజేపీ నేతలు దీనిపై తీవ్రంగా స్పందించారు. కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ అంశంపై ఎన్నికల సంఘానికి కూడా ఆప్ నేతలు ఇటీవలే ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలంటూ హర్యానా సర్కారును ఈసీ ఆదేశించింది. ఈక్రమంలోనే సమస్యను రెండు దేశాల మధ్య యుద్ధంలా చూడొద్దని కేజ్రీవాల్‌కు వివరించింది.


అలాగే రెండు వర్గాల మధ్య శత్రుత్వం, అశాంతిని కల్గించేలా వ్యాఖ్యలు చేశారంటూ.. వీటిపై ఎందుకు చర్యలు తీసుకోవద్దో చెప్పమంటూ కేజ్రీవాల్‌ను ప్రశ్నించింది. ఈ సమస్యను విష ప్రయోగం అనే సంబోధించకుండా.. నదిలో నీటి స్వభావం, పరిణామం, విష పూరితమైన విధానాన్ని గుర్తించే పద్ధతులపై సాక్ష్యాధారాలు అందించాలంటూ వెల్లడించింది. శుక్రవారం ఉదయం 11 గంటలలోపు సాక్ష్యాలను ఢిల్లీ జల్ బోర్డుకు సమర్పించాలని చెప్పింది. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించగా.. తాజాగా దీనిపై కేజ్రీవాల్ స్పందించారు.


యమునా నది అంశంపై ఎన్నికల సంఘం తనకు పంపిన నోటీసుల్లో ఉపయోగించిన భాష సరిగ్గా లేదని అన్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేయడం తగదంటూనే.. తాను ఓ మూడు బాటిళ్ల యమునా నది నీళ్లను ఈసీ అధికారులకు పంపిస్తానని చెప్పారు. వారు ఆ నీటిని మీడియా ముందే తాగితే.. తన తప్పు ఒప్పుకుంటానని వెల్లడించారు. ఢిల్లీలో బహిరంగంగానే డబ్బు పంపిణీ జరుగుతుందని.. కానీ ఈసీ దాన్ని పట్టించుకోకుండా ఈ అంశంపై స్పందిస్తుందని కామెంట్లు చేశారు.


అంతటితో ఆగకుండా తనను మరో రెండు రోజుల్లోనే జైలుకు పంపిస్తారని.. కానీ తను దాని గురించి ఏమాత్రం భయపడడం లేదని కేజ్రీవాల్ వెల్లడించారు. తాను జీవించి ఉన్నంత కాలం ఢిల్లీ ప్రజలను కలుషితమైన నీటిని మాత్రం అస్సలే తాగనివ్వనని వ్యాఖ్యానించారు. మరి దీనిపై ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com