ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అత్యాచార కేసులో కాంగ్రెస్ ఎంపీ రాకేశ్ రాథోడ్‌ అరెస్ట్

national |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2025, 08:29 PM

ఉత్తర ప్రదేశ్‌లోని సీతాపూర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ రాకేశ్ రాథోడ్‌ను గురువారం రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న అతడు.. ఇంటి వద్ద ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నారు. ఈక్రమంలోనే కొత్వాలి నగర్ పోలీసులు అతడిని అదుపులోకీ తీసుకునేందుకు వెళ్లగా.. విలేకరుల సమావేశం మధ్యలోంచే లాక్కొచ్చారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరు పరిచారు. ఎంపీ అరెస్ట్ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు, మద్దతుదారులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కోర్టు వద్దకు చేరుకున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


తనను పెళ్లి చేసుకుంటానని చెబుతూ.. గత నాలుగేళ్లుగా తనపై సీతాపూర్ ఎంపీ రాకేశ్ రాథోడ్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఓ మహిళ ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేసింది. జనవరి 17వ తేదీన కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన మహిళ.. ఎంపీతో తాను మాట్లాడిన కాల్ రికార్డింగులను సైతం అందించింది. దీంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు.


అయితే విషయం తెలుసుకున్న కాంగ్రెస్ ఎంపీ బుధవారం రోజు ఉదయమే అలహాబాద్ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌లో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. అయితే దీనిపై జస్టిస్ రాజేష్ సింగ్ చౌహాన్‌తో కూడిన సింగిల్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈక్రమంలోనే పిటిషనర్ తరఫు న్యాయవాది ఎంపీని తప్పుడు కేసులో ఇరికించారని.. నాలుగేళ్ల కింద జరిగిన దానికి ఇప్పుడు కేసు పెట్టడం ఏంటంటూ వాదించారు.


కానీ న్యాయస్థానం మాత్రం కాంగ్రెస్ ఎంపీ రాకేశ్ రాథోడ్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. రెండు వారాల్లోనే కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ఇదే కేసులో ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసినా తిరస్కరణకు గురయ్యాయి. ఈక్రమంలోనే పోలీసులు భారీ బందోబస్తుతో ఆయన ఇంటికి వెళ్లి మరీ అదుపులోకి తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com