ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు వెళ్తూ పుణ్య స్నానాలు చేస్తున్నారు. అక్కడ ఉండే ఆలయాలకు వెళ్తూ ప్రత్యేక పూజలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు. ఈక్రమంలోనే అనేక కుంభమేళాకు వెళ్తున్న అనేక మంది వీడియోలు నెట్టింట వైరల్గా మారుతున్నాయి. అయితే తాజాగా అక్కడ వేప పుల్లలు అమ్ముకునే ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఎలాంటి పెట్టుబడి లేకుండా ప్రారంభించిన ఈ వ్యాపారంలో కేవలం ఐదు రోజుల్లోనే 40 వేలు సంపాదించినట్లు చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
మహా కుంభమేళాకు సంబంధించి ఈమధ్య అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే అందులో అక్కడకు వస్తున్న భక్తులవే కాకుండా.. చిరు వ్యాపారాలు చేసుకునే సామాన్య ప్రజలవి కూడా ఉన్నాయి. అయితే ఇటీవలే రుద్రాక్షలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న మొనాలిసా అందానికి ఫిదా అయిన నెటిజెన్లు.. ఇప్పుడు ఓ యువకుడు చేస్తున్న వ్యాపారానికి ఫిదా అయ్యారు. ముఖ్యంగా అతడు కేవలం వేప చెట్ల నుంచి సేకరించిన పుల్లలను అమ్ముకుంటున్నాడు.
ఎలాంటి పెట్టుబడి లేకుండా.. కొన్ని చెట్ల నుంచి వందల సంఖ్యలో పుల్లలు తీసుకు వచ్చిన ఇతడు.. కుంభమేళాకు వస్తున్న భక్తులకు వాటిని అమ్ముతున్నాడు. అయితే సాధువులు, సన్యాసులు, అఘోరీలు వంటి వాళ్లు బ్రష్లకు బదులుగా ఇలాంటి పుల్లలనే పళ్లు తోముకోవడానికి వాడుతుంటారు. వారంతా వీటిని కొనుగోలు చేస్తుండడంతో.. కేవలం 5 రోజుల్లోనే ఆ యువకుడు 30 వేల నుంచి 40 వేల వరకు సంపాదించాడు.
తాజాగా కుంభమేళాకు వెళ్లిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్ ఈ వేప పుల్లలు అమ్మడాన్ని చూసి ఆసక్తిగా అడుగుతూ వీడియో తీయగా.. సదరు యువకుడు ఈ విషయాలన్ని చెప్పాడు. అయితే నీకు ఈ ఐడియా ఎవరు ఇచ్చారని అడగ్గానే.. యువకుడు సిగ్గు పడుతూ నాకు ప్రేయసి చెప్పిందని చెప్పాడు. రూపాయి ఖర్చు లేకుండా వేలు సంపాదించడం చాలా సంతోషంగా ఉందని.. కుంభమేళా సాగినన్న రోజులు ఇవే అమ్ముకుంటానంటూ హర్షం వ్యక్తం చేశాడు.
ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ పెద్ద ఎత్తున కామెంట్లు, షేర్లు చేస్తున్నారు. నీ ప్రేయసి ఇచ్చిన ఐడియా అదిరిందిగా అంటూ పలువురు కామెంట్లు చేస్తుండగా.. ఎలాంటి పెట్టుబడి లేకుండా వేలు సంపాదిస్తున్నావుగా పో అంటూ మరికొందరు వివరిస్తున్నారు. నేను కూడా వచ్చేస్తాను బ్రో అంటూ ఓ నెటిజెన్ కామెంట్ చేయగా.. నన్ను కూడా తీసుకెళ్లంటూ మరో వ్యక్తి రిప్లై ఇచ్చాడు. మీరు కూడా ఓసారి ఈ వీడియోను చూసేయండి మరి.