ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిడ్మాకు షాక్.. మావోయిస్ట్ కేంద్ర కమిటీ నుంచి ఉద్వాసన

national |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2025, 08:33 PM

మావోయిస్ట్ కేంద్ర కమిటీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సెంట్రల్ కమిటీ సభ్యత్వం నుంచి మద్వీ హిడ్మాను తొలగించింది. ఇటీవల జరిగిన వరుస పరిణామాలతో హిడ్మాను తొలగించాలని నిర్ణయించింది. గత కొన్నాళ్లుగా ఎన్నడూ లేనంతగా మావోయిస్ట్‌లు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. సరైన వ్యూహరచన చేయడంలో హిడ్మా విఫలమయ్యారని భావించిన మావోయిస్ట్ పార్టీ.. సెంట్రల్ కమిటీ నుంచి తప్పించింది. అయితే, దండకారణ్యంలో హిడ్మా కీలక పాత్ర పోషిస్తుండటం గమనార్హం. మావోయిస్ట్ పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక విభాగమైన కేంద్ర కమిటీలో సభ్యులుగా కీలక నాయకులే ఉంటారు. హిడ్మాను తాజాగా తొలగించి.. ఆయన స్థానంలో మరొకర్ని నియమించినట్టు తెలుస్తోంది.


దీంతో ప్రస్తుతం మావోయిస్ట్ కేంద్ర కమిటీలో అతి పిన్న వయస్కుడు 54 ఏళ్ల పాటిరామ్ మాంఝీ. అతడి తలపై కోటి రూపాయల రివార్డు ఉంది. అధికార వర్గాల ప్రకారం.. ఇటీవలి హతమైన అగ్రనేత రామచంద్ర రెడ్డి అలియాస్ చలపతి.. ఎన్‌కౌంటర్‌కు ముందు తయారుచేసిన పత్రంలో 12వ స్థానంలో ఉన్నట్లు చూపించారు. అయితే, ఆయన వాస్తవానికి కేంద్ర కమిటీలోని టాప్ 10 సీనియర్ మావోయిస్టులలో ఒకరని అధికారి తెలిపారు.


ఒడిశా కమిటీలో దాదాపు అరడజను మంది కీలక సభ్యులు ఉన్నారని వర్గాలు తెలిపాయి. వీరిలో మోడెం బాలకృష్ణ అలియాస్ బాలన్న రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇటీవలి నెలల్లో జరుగుతోన్న ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో బౌధ్ ప్రాంతంలో రాష్ట్ర స్థాయిలో మార్పులు జరిగాయని,ఇతర ఏరియా కమిటీలు కూడా పునర్నిర్మాణానికి గురయ్యాయని ఒక అధికారి వివరించారు.


గతంలో మావోయిస్ట్ కేంద్ర కమిటీని ప్రభావితం చేసిన కీలక వ్యక్తుల్లో హిడ్మా కూడా ఉన్నారని తేలింది. అయితే, ఇటీవలి కాలంలో మార్పులు జరిగి ఉండొచ్చని అంటున్నారు. 2017 సుక్మా దాడి తర్వాత హిడ్మాకు పదోన్నతి కల్పించి కీలకమైన స్థానంలో ఉంచారని నిఘా నివేదికలు సూచిస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఇది ప్రతిబింబిస్తుందని ఈ విషయం గురించి తెలిసిన ఒక సీనియర్ అధికారి చెప్పారు. కేంద్ర కమిటీతో పాటు తూర్పు దళంలోనూ మార్పులు జరిగాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com