మోనాలిసా భోస్లే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా.. మోనాలిసా జీవితాన్నే మార్చేసింది. దీంతో బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా.. తాను తీయబోయే తర్వాతి సినిమాలో మోనాలిసాకు అవకాశం ఇస్తానని ప్రకటించారు. చెప్పినట్లుగానే ఇప్పటికే మోనాలిసా తండ్రితో ఫోన్ మాట్లాడిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా.. తాజాగా మోనాలిసాను కలిశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు సమీపంలో ఉండే ఖర్గోన్ జిల్లా మహేశ్వర్ గ్రామానికి వెళ్లారు. తాను తర్వాతి ప్రాజెక్ట్ అయిన "ది స్టోరీ ఆఫ్ మణిపూర్" సినిమాలో మోనాలిసాకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే మోనాలిసా కుటుంబానికి.. సినిమా ఇండస్ట్రీ గురించి డైరెక్టర్ సనోజ్ మిశ్రా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మోనాలిసా తండ్రి జై సింగ్ భోస్లే అడిగిన ప్రశ్నలకు సనోజ్ మిశ్రా సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మోనాలిసాతో దిగిన ఫోటోను సనోజ్ మిశ్రా షేర్ చేశారు.
దీంతో చివరికి జై సింగ్ భోంస్లే.. మోనాలిసా సినిమాలో నటించేందుకు అంగీకరించారు. ఇందుకు సంబంధించి ఈ సినిమా చేసేందుకు మోనాలిసాతో సంతకం చేయించుకున్నారు. "ది డైరీ ఆఫ్ మణిపూర్" సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఆలోపు మోనాలిసాకు సినిమా ట్రైనింగ్ ఇప్పించాలని సనోజ్ మిశ్రా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం మోనాలిసాను ముంబైకి తీసుకువచ్చి అక్కడ యాక్టింగ్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఈ "ది డైరీ ఆఫ్ మణిపూర్" సినిమాను రిలీజ్ చేసేందుకు డైరెక్టర్ సనోజ్ మిశ్రా సోషల్ మీడియాలో ప్రకటించారు.
ఇక ఈ "ది డైరీ ఆఫ్ మణిపూర్" సినిమాను సనోజ్ మిశ్రా డైరెక్షన్ చేస్తుండగా.. ఇందులో హీరోగా అమిత్ రావు నటించనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావు సోదరుడే ఈ అమిత్ రావు. అయితే ఈ సినిమాకు సంబంధించి కొంత స్టోరీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మణిపూర్‌కు చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ కుమార్తెగా ఈ సినిమాలో మోనాలిసా నటించనుంది. అయితే ఆ యువతికి.. ఆర్మీలో చేరాలనే కల ఉంటుందని.. అందుకు ఆమె ఎలాంటి కష్టాలు ఎదుర్కొంది. ఆ కష్టాలను ఎలా ఎదురించి చివరికి సైన్యంలో చేరింది అనేదే ఈ సినిమా స్టోరీ అని తెలుస్తోంది.