ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై అందరి దృష్టీ నెలకొంది. ఆమె వరుసగా ఎనిమిదో సారి ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టనుండటం విశేషం. ఈ రికార్డు ఇప్పటికే ఆమె పేరుతో ఉంది. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు నిర్మలమ్మ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా ఆదాయపు పన్ను ఊరట.. రైతులకు వరాలు.. మహిళలకు లబ్ధి వంటి వరాలు ఉండొచ్చన్న అంచనాలతో సహా పరిశ్రమ వర్గాల నుంచి కూడా పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. క్యాలెండర్ ఇయర్‌ను ఆర్థిక సంవత్సరంగా మార్చాలని పలువురు పన్ను నిపుణులు సూచిస్తున్నారు. బడ్జెట్లోనే దీనిపై ప్రకటన చేయాలని కోరుతున్నారు. ఈ డిమాండ్ ఎందుకు తెస్తున్నారు.. వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండొచ్చు.. ఏం లాభాలు ఉండొచ్చు.
మన దేశంలో ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి మరుసటి సంవత్సరం మార్చి 31 వరకు ఉంటుంది. ఇతర చాలా దేశాల్లో క్యాలెండర్ ఇయర్ అయిన జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఉన్న దానినే ఆర్థిక సంవత్సరంగా కూడా పరిగణిస్తున్నాయి. మన దగ్గరే ఇలా క్యాలెండర్ ఇయర్, ఆర్థిక సంవత్సరం వేర్వేరుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా.. మన దగ్గర కూడా ఆర్థిక సంవత్సరాన్ని మార్చాలని కోరుతున్నారు.
ఇలా ఆర్థిక సంవత్సరాన్ని క్యాలెండర్ ఇయర్‌కు మార్చినట్లయితే.. పాలనా సామర్థ్యం పెరగడంతో పాటు.. వ్యక్తులకు, వ్యాపారులకు మరింత స్పష్టత కూడా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో మల్టీ నేషనల్ కంపెనీలకు (బహుళ జాతి కంపెనీలు), ఎన్ఆర్ఐ లకు కూడా ఈ విధానం అనువుగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇంకా క్యాలెండర్ ఇయర్‌కు అనుగుణంగా పన్ను గడువు తేదీలు, ఆర్థిక ప్రణాళికలు చేసుకునేందుకు వీలుగా ఉంటుందని చెబుతున్నారు.
అయితే.. ఆర్థిక సంవత్సరాన్ని మార్చాలన్న డిమాండ్ విషయంలో ఏకాభిప్రాయం మాత్రం లేదు. కొందరి నుంచి భిన్నాభిప్రాయాలు కూడా వస్తున్నాయి. ఇలా ఆర్థిక సంవత్సరం విధానం మారిస్తే.. ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వొచ్చని పేర్కొంటున్నారు నిపుణులు. కొత్త పన్ను తేదీల్ని బట్టి దానికి అనుగుణంగానే టాక్స్ పేయర్స్, వ్యాపారులు తమ ప్రణాళికల్ని సర్దుబాటు చేసుకోవడంలో కూడా ఇబ్బందులు పడొచ్చని అంటున్నారు. ఒక్కసారిగా ఆర్థిక సంవత్సరం మారితే.. అప్పుడు మారిన తేదీలకు అనుగుణంగా ముందుగానే రిటర్న్స్ దాఖలు చేయడం, కొత్తగా పన్ను లెక్కలు వేసుకోవడం వంటి విషయాల్లో కూడా ఇబ్బందులు తలెత్తొచ్చని పలువురు పేర్కొంటున్నారు.