ఎనిమిది నెలలైనా హామీలు అమలు చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు, తన అసమర్థతను జగన్ మీదకి డైవర్ట్ చేసేందుకు నీతి ఆయోగ్ రిపోర్టును ఇష్టారీతిగా మార్చేశారని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ ఆక్షేపించారు. తన ఐదేళ్ల పాలనను, జగన్ ఐదేళ్ల పాలనతో పోల్చకుండా కరోనా ఏడాదితో పోల్చినప్పుడే చంద్రబాబు తన అసమర్థతను బయటపెట్టుకున్నారని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికల హామీల అమలుపై మాట్లాడకుండా నిత్యం డైవర్షన్ పాలిటిక్స్‌తోనే రోజులు నెట్టుకొస్తున్నారు.
సూపర్ సిక్స్ పథకాల అమలుకు అవసరమయ్యే రూ.1.5 లక్షల కోట్లు ఎలా తెస్తారని అడిగినప్పుడు సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు.. తీరా అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయమని అడిగినప్పుడల్లా జగన్ హయాంలో అప్పులు గురించి తప్పుడు లెక్కలు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారు. చివరకు నీతి ఆయోగ్ రిపోర్టు గురించి వివరణ ఇస్తూ పథకాల అమలు తన వల్ల కాదని స్వయంగా చంద్రబాబే తేల్చేశారు. రాజకీయాల్లో తనది 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకి ప్రభుత్వ ప్రాధాన్యతపై ఇప్పటికీ స్పష్టత రాలేదని తేల్చి చెప్పారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలకు గ్యారంటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.