ఉత్తర ప్రేదశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం అనేక మంది ఇక్కడకు వస్తూ... గంగ, యమున, సరస్వతీ నదులు కలిసే త్రివేణీ సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఆపై ప్రత్యేక పూజ్లలో పాల్గొంటున్నారు. జనవరి 13వ తేదీన ప్రారంభం అయిన ఈ కుంభమేళాకు.. ప్రతిరోజూ కోటి మందికి పైగా భక్తులు వస్తున్నారు.
ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజు దాదాపు 3 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించగా.. ఇప్పటి వరకు మొత్తంగా 20 కోట్లకు పైగా భక్తులు ప్రయాగ్రాజ్ వెళ్లారు. అయితే ఈరోజు మౌని అమావాస్య ఉండడంతో భక్తుల తాకిడి మరింత పెరిగింది. ఈ ఒక్క రోజే దాదాపు 10 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించబోతున్నట్లు సమాచారం. అయితే ఉదయం 9 గంటల వరకే 3 కోట్ల మందికి పైగా భక్తులు స్నానాలు చేయగా.. 12 గంటల వరకు 4.5 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు తెలుస్తోంది.
అయితే భక్తుల తాకిడి ఎక్కువ అవుతుండగా.. యూపీ సర్కారు కూడా పెద్ద ఎత్తునే ఏర్పాట్లు చేసింది. కానీ అక్కడక్కడా పలు సమస్యలు వస్తూనే ఉన్నాయి. దీంతో భక్తులు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అయితే తాజాగా కుంభమేళాకు వెళ్లిన భక్తులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. అందులో వారంతా తమ చెప్పుల కోసం వెతుక్కుంటూ.. గంటల సమయం వృథా చేసుకున్నారు.
పుణ్య స్నానాలు అయిన వెంటనే భక్తులు అంతా బడే హనుమాన్ ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈక్రమంలోనే ఆలయం బయట చెప్పులు విడిచి వెళ్లారు. అయితే లక్షలాది మంది ప్రజలు అక్కడే చెప్పులు విడవడంతో.. దర్శనానంతరం వారి చెప్పులు వెతుక్కోవడానికి ప్రజలు తిప్పలు పడ్డారు. నా చెప్పులు ఎక్కడంటే, నా చెప్పులు ఎక్కడంటూ వారంతా వెతుక్కుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. చూసిన వారంతా చెప్పుల కోసం ఇంత గొడవ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కొందరు అయితే మీకు నచ్చిన చెప్పులు వేసుకుని వెళ్లండి బ్రో అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. ఏవి వస్తే, ఏవి బాగుంటే అవే తీసుకోండంటూ ఓ నెటిజెన్ చెప్పగా.. పుణ్య క్షేత్రాల వద్ద చెప్పులు పోతే మంచిదే వదిలేసి వెళ్లిపోమంటూ మరో యువకుడు కామెంట్ చేశాడు.