ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆదాయపు పన్ను రద్దుకు ట్రంప్ ప్రతిపాదనలు

international |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2025, 09:53 PM

అమెరికన్లే ఫస్ట్ అనే నినాదంతోనే ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారికి ప్రయోజనం కలిగించే పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా, అమెరికన్లకు మేలు చేసేలా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదాయపు పన్ను నుంచి విముక్తి కల్పించేలా ట్రంప్ ప్రతిపాదనలు చేశారు. ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచేందుకే ఆయన ఈ ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం. ప్రజలను ధనవంతులు చేసే వ్యవస్థ పునరుద్ధరణకు ఇది తోడ్పాటు అందిస్తుందని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు.


ప్రస్తుతం అమెరికా ఆదాయంలో ఇన్‌కమ్ ట్యాక్స్ ద్వారా నుంచి వచ్చే మొత్తం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. ట్రంప్‌ నిర్ణయంతో ఏర్పడిన లోటును భర్తీ చేయడానికి కస్టమ్స్ టారీఫ్‌లను వాడుకోవాలన్నది ప్రణాళికగా చెబుతున్నారు. రిపబ్లికన్ సభ్యులతో జరిగిన సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ..‘‘అమెరికన్లను ధనవంతులు, మరింత శక్తిమంతులుగా మార్చే వ్యవస్థ దిశగా అడుగులు వేస్తున్నాం.. ఇతర దేశాలకు లబ్ది చేకూర్చేందుకు మన పౌరులపై పన్నులు వేసే బదులు.. మనమే విదేశాలపై సుంకాలు విధించి అమెరికన్లను సంపన్నులను చేయాలి. ఈ పన్నుల వసూళ్లకు ఎక్స్‌టర్నల్‌ రెవెన్యూ సర్వీసును ప్రారంభించాను’ అని అన్నారు.


దేశ చరిత్రలో 1870-1913 మధ్య అత్యధిక సంపదతో అమెరికన్లు తులతూగారన్న ట్రంప్.. అందుకు సుంకాల ఆధారిత ఆర్థిక వ్యవస్థే కారణమని చెప్పారు. అప్పట్లో దిగుమతి పన్నుల ద్వారా ప్రభుత్వానికి పెద్దమొత్తంలో ఆదాయం సమకూరేదని పేర్కొన్నారు. తక్షణమే అమెరికా తన వాణిజ్య వ్యవస్థను మార్చుకోవాల్సిన అవసరం ఉందని, ఉద్యోగులు, కుటుంబాలను రక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


ఇక, భారత్‌, చైనా, బ్రెజిల్‌పై అత్యధిక పన్నులు తప్పవని ట్రంప్‌ స్పష్టం చేశారు. ‘‘కొన్ని దేశాలు ఏం చేస్తున్నాయో పరిశీలించండి.. చైనా భారీగా దిగుమతి సుంకాలు వసూలు చేస్తోంది. ఇక భారత్‌, బ్రెజిల్‌ తదితర దేశాలు కూడా ఆ విధానమే అనుసరిస్తున్నాయి.. మనం అలా చేయకూడదు.. అన్నింటికంటే అమెరికా ప్రయోజనాలే ముందుండాలి’ అని వ్యాఖ్యానించారు. కాగా, బ్రిక్స్‌ దేశాలు ప్రత్యేక కరెన్సీ తీసుకొస్తే 100 శాతం సుంకం విధిస్తామని గత డిసెంబర్‌లోనే ట్రంప్ హెచ్చరించారు. డాలర్‌ వినియోగం నిలిపేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com