ఏపీ మంత్రి నారా లోకేశ్ సాక్షి మీడియాపై పరువునష్టం కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం నేడు విశాఖలో కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. "మహారాష్ట్రలో స్థిరమైన ప్రభుత్వం ఉండడం వల్ల వారికి పెట్టుబడులు వస్తున్నాయి. స్థిరమైన ప్రభుత్వం వల్ల పారిశ్రామికవేత్తల్లో ఆత్మవిశ్వాసం నెలకొంటుంది. గతంలో దావోస్ లో జగన్ రెడ్డిని కలిసేందుకు ఓ పారిశ్రామికవేత్త ప్రయత్నిస్తే కలవబోమని చెప్పారట. టీడీపీ హయాంలో పెట్టుబడులు పెట్టడమే కారణమని సదరు వ్యక్తి చెప్పారు. అది ప్రపంచంలోనే పేరుపొందిన కంపెనీ. కనీసం వారి సమస్యలు పరిష్కరించేందుకు కూడా జగన్ రెడ్డి కానీ, పరిశ్రమల మంత్రి కానీ వారిని కలవలేదు.నేను మంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సారి ఐటీ కంపెనీలతో సమావేశం పెట్టాను. ప్రజలు కూడా ఆలోచించాలి. గుజరాత్ లో ఐదుసార్లు ఒకే ప్రభుత్వం ఉండటం వల్ల, మహారాష్ట్రలో కూడా అదే ప్రభుత్వం రావడం వల్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. అయితే, జగన్ రెడ్డి మళ్లీ రాడని గ్యారంటీ అడుగుతున్నారు. అమర్ రాజా బ్యాటరీని ఎంతగా ఇబ్బంది పెట్టారో మనం చూశాం. ఏపీలోనే హయ్యస్ట్ టాక్స్ పేయర్ అమర్ రాజా. జగన్ రెడ్డి, అమర్ నాథ్ వేధించారు. అమర్ రాజా బ్యాటరీ వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదు. వారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటి వారిని ఇబ్బందిపెట్టారు. ఇంకెవరొస్తారు?... అంటూ లోకేశ్ విమర్శించారు.అమర్ నాథ్ మంత్రిగా ఉన్నప్పుడు దావోస్ నుంచి ఎన్ని పెట్టుబడులు తీసుకువచ్చారో చెప్పాలని నారా లోకేశ్ నిలదీశారు. కూటమి ప్రభుత్వం 7 నెలల్లో రూ.6,33,568 కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చిందని... 4,10,128 మందికి ఉద్యోగాలు వస్తాయని లోకేశ్ స్పష్టం చేశారు. "చంద్రబాబు గారు 1997 నుంచి దావోస్ కు వెళుతున్నారు. దావోస్ లో ఎప్పుడూ ఒప్పందాలు చేసుకోరు. చర్చిస్తాం. వారి ఆసక్తిని బట్టి ఆ తర్వాత ఒప్పందాలు చేసుకుంటాం. ఆర్సెలర్ మిట్టల్ తో మేం ఒప్పందం చేసుకోలేదు. ఎంవోయూ ఎందుకు... డైరెక్ట్ గా వర్క్ లోకి వెళదామని వారు చెప్పారు. దీనికి కూడా మమ్మల్ని తప్పుబడతారా? వారికి అన్ని అనుమతులు ఇచ్చాం. భూమి కేటాయింపులు చేస్తాం. 6,7 నెలల్లో పనులు ప్రారంభించే లక్ష్యంతో పనిచేస్తాం. ఇవన్నీ వైసీపీ హయాంలోనే వస్తే ఎందుకు శంకుస్థాపనలు చేయలేదు? వైఎస్ వల్లే కియా మోటార్స్ వచ్చిందని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేశారు. టీసీఎస్ క్రెడిట్ తీసుకునేందుకు కూడా ప్రయత్నించారు. నేను వెళ్లి మాట్లాడి టీసీఎస్ కంపెనీని తీసుకువచ్చా" అని నారా లోకేశ్ ఉద్ఘాటించారు.